ఏపీలో బాబు ఓటుకు నోటు రాజకీయాలు

 • నేరాల‌కు అలవాటు పడ్డ చంద్రబాబు
 • ఓటుకు నోటు కేసులో దొరికినా మారని బుద్ధి
 • రాజ్యసభ సీటు కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎర
 • ఆరోజే శిక్షపడి ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు
 • బాబు పాపంలో మోడీ భాగస్వామ్యం కావొద్దు
 • వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి

 • తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా  కూడా  చంద్రబాబుకు ఇంకా జ్ఞాన‌ోదయం క‌ల‌గ‌లేద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అన్నారు. నేరాల‌కు అల‌వాటు ప‌డిన వ్య‌క్తులు ఎప్ప‌టికీ నేరాలు చేస్తునే ఉంటార‌ని చెప్ప‌డానికి చంద్రబాబే నిద‌ర్శ‌న‌మన్నారు.

  అవినీతి సొమ్ముతో అనైతిక రాజకీయాలు
  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటుకు నోటు త‌ర‌హాలో చంద్రబాబు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనేందుకు అనైతిక రాజ‌కీయాల‌కు తెర తీశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 50 మంది శాస‌న‌స‌భ్యులు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నార‌ని, 36 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాజ్య‌స‌భ స్థానం గెలుస్తుంద‌ని ఆయ‌న వివ‌రించారు. బాబు ఏ ఉద్దేశ్యంతో నాలుగో అభ్య‌ర్థిని పోటీకి దించుతారని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు.  

  అప్పుడే శిక్ష ప‌డి ఉంటే...
  గ‌తంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు శిక్ష ప‌డి ఉంటే ఈ రోజు ఇలాంటి నీచ రాజ‌కీయాలకు పూనుకునేవారు కాద‌న్నారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు చంద్రబాబు ఒక్కొక్క‌రికి రూ.  40 కోట్లు ఆశ చూపిస్తున్నార‌ని కోటంరెడ్డి  ఫైరయ్యారు.  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా టీడీపీకి ఓటు వేస్తే రూ. 40  కోట్లు ఇస్తామంటూ బాబు ఆశపెడుతున్నాడని ఆగ్రహించారు. నిస్సిగ్గుగా డబ్బులను ఎరచూపి ఎమ్మెల్యేలను కొనాలని చూడడం దుర్మార్గమన్నారు. 

  బాబు పాపంలో ఎలా భాగస్వాములవుతారు..
  చంద్రబాబుకు ఇంత డ‌బ్బు ఎక్కడి నుంచి వ‌చ్చింద‌ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్ర‌శ్నించారు. నైతిక‌, విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు కావాల‌ని ప‌దేప‌దే చెప్పే న‌రేంద్ర మోడీ..చంద్రబాబు నీచ రాజకీయాలపై స్పందించాలన్నారు. చంద్రబాబు చేస్తున్న పాపంలో ప్రధాని భాగస్వామ్యం కావొద్దని సూచించారు.  బీజేపీకి ఒక సీటు ఇస్తూ చంద్రబాబు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనైతిక రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని కోటంరెడ్డి నిప్పులు చెరిగారు.  

తాజా ఫోటోలు

Back to Top