విశ్వసనీయతకే ఓటేయండి

గుత్తి (అనంతపురం జిల్లా),

15 ఏప్రిల్ 2014: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిలా విశ్వసనీయత కలిగిన నాయకుడినే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ మహానేత మాదిరిగా పన్నులేవీ పెంచకుండానే రాష్ట్రాన్ని ఒక చేత్తో అభివృద్ధి వైపు నడిపించగల సత్తా, మరో చేత్తో సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయగల దమ్ము ఉన్న వారికే విజయం చేకూర్చిపెట్టాలని పిలుపునిచ్చారు. మహానేత వైయస్ఆర్‌ ముందు, ఆయన తరువాత ముఖ్యమంత్రులు చేయని విధంగా రాష్ట్రంలో ఆయన హయాంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలయ్యాయని శ్రీ జగన్‌ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పథకాలు వెనుకబడ్డాయన్నారు. అలాంటి మహానేత అసలైన వారసుడిగా తాను ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తానని, రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తానని శ్రీ జగన్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం 'వైయస్ఆర్‌ జనభేరి' కార్యక్రమంలో భాగంగా శ్రీ జగన్‌ మంగళవారంనాడు అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో హాజరైన జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎన్నికల గుర్తు 'ఫ్యాన్'కు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.

ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పెట్టే ఐదు సంతకాలు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని, రాష్ట్ర చరిత్రనే మార్చివేస్తాయని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. 'అమ్మ ఒడి పథకం' ద్వారా ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరేసి పిల్లలకు ఒకటవ తరగతి నుంచి ఉన్నత చదువులకు ఉచితంగా చదివించే బాధ్యతను తానే తీసుకుంటానన్నారు. వృద్ధులకు ఆనందంగా ఉంచేందుకు వారికి ఇచ్చే పింఛన్‌ను రూ. 200 నుంచి రూ. 700కు పెంచుతామని హామీ ఇచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు వచ్చేలా రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని, తుపానులు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులను ఆదుకునేందుకు రూ. 2 వేల కోట్లతో 'విపత్తుల సహాయ నిధి' ని ఏర్పాటు చేస్తానని చెప్పారు.

మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడం కోసం రూ. 20,000 డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని శ్రీ వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. మహిళలకు ఇచ్చే రుణాలు, వడ్డీ నిబంధనలను సరళతరం చేస్తామన్నారు. గ్రామాల ముంగిట్లోకే పరిపాలన తీసుకువస్తానన్నారు. ప్రతి పంచాయతీ, మున్సిపల్ వార్డులోనే‌ కార్యాలయం ఏర్పాటు చేసి 24 గంటల్లోనే ఏ కార్డయినా అందేలా చూస్తామన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను రద్దు చేయడమే కాకుండా ఆయా గ్రామ పంచాయతీ నుంచే పది మంది మహిళలను పోలీసులుగా నియమిస్తామని తెలిపారు. పేదల కోసం సంవత్సరానికి 10,000 చొప్పున వచ్చే ఐదేళ్ళలో 50,000 పక్కా ఇళ్ళు నిర్మించి అందజేస్తామన్నారు. ఆ ఇళ్ళకు పూర్తి స్థాయి హక్కు పత్రాలిస్తామని, వాటికి బ్యాంకు రుణాలు కూడా వచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పారు.  2019 నాటికి రాష్ట్రంలో ఒక్కరు కూడా ఇల్లు లేని వ్యక్తి లేకుండా చేస్తామన్నారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని శ్రీ జగన్‌ హామీ ఇచ్చారు. నిరు పేదలకు నాణ్యమైన వైద్య సౌకర్యాలు కల్పించడానికి ప్రతి జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించడానికి కృషి చేస్తానని తెలిపారు.

చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలని, ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆతృతతో అమలు సాధ్యం కాని, అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారని శ్రీ జగన్‌ నిప్పులు చెరిగారు. తాను ఒకసారి మాట ఇస్తే.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, హామీలన్నింటినీ అమలు చేసి చూపిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి భారీ స్థాయిలో ఓట్లు వేసి అఖండ మెజారిటీ ఇచ్చి, తనకు బలాన్ని చేకూర్చాలని శ్రీ జగన్‌ కోరారు.

మరో 25 రోజుల్లో మన తల రాతలు మార్చివేసే ఎన్నికలు రాబోతున్నాయని, వైయస్ఆర్‌ నాటి సువర్ణ యుగాన్ని మళ్ళీ తీసుకురాగల సత్తా ఎవరికి ఉందో వారినే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. మహానేత వైయస్ఆర్‌కు ముందూ వెనుక ఎందరో సీఎంలు వచ్చారు. కాని ప్రజలకు నిరంతరం గుర్తుండే ముఖ్యమంత్రి ఒక్క వైయస్ఆర్ మాత్రమే ‌అన్నారు. పేదల పట్ల ఆయనకు ఉన్న అభిమానం, ఆప్యాయత కారణంగానే మరణించి ఇన్నేళ్ళయినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉన్నారని శ్రీ జగన్ గుర్తుచేశారు.‌ ఆ మహానేతకు సిసలైన వారసుడిగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తానని, దేశంలోనే ఒక మోడల్‌ సీఎంగా నిలుస్తానని చెప్పారు.

వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్త కాదని శ్రీ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు నోటికి వచ్చిన హామీలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. రూ.2కే కిలో బియ్యం పథకాన్ని నిర్వీర్యం చేసి.. కిలో రూ.5.25కి పెంచిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో తాము అనుభవించిన కష్టాలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని అన్నారు. అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని నిప్పులు చెరిగారు. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ గురించి చంద్రబాబు ఇప్పుడు చాలా హామీలిస్తున్నారని, తాను అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో వాటిని ఎందుకు అమలు చేయలేదని శ్రీ జగన్‌ నిలదీశారు. ఎన్నికలయ్యాక తాను ఇచ్చిన హామీలను మరిచిపోయే తత్వం చంద్రబాబుది అన్నారు.

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో విపరీతంగా పన్నుల భారం వేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని గుర్తుచేశారు. మద్య నిషేధాన్ని ఎత్తివేసిన ఘనుడు చంద్రబాబు నాయుడని, రాష్ట్రంలో బెల్టు షాపులను ప్రోత్సహించింది ఆయనే అని శ్రీ జగన్‌ ప్రస్తావించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడంలో సోనియా గాంధీతో చేతులు కలిపారని, రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభకు వచ్చినప్పుడు టీడీపీ ఎంపీయే మొదటి ఓటు వేశారని గుర్తుచేశారు.

మరో 30 వరకూ తాను ప్రజా జీవనంలో ఉంటానని, చంద్రబాబు నాయుడిలా తాను అబద్ధపు వాగ్దానాలు ఇవ్వనని, వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తెస్తామని శ్రీ జగన్ హామీ‌ ఇచ్చారు.

Back to Top