విశాఖ తీరం జన సంద్రం


విశాఖలో పాదయాత్రకు విశేష స్పందన
మరే నాయకుడికి ఇంత ప్రజాదరణ ఉండదు
భూకబ్జాలకు పాల్పడినవారిని కోర్టు బోన్‌లో నిలబెడతాం
కంచరపాలెం బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుంది
వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: విశాఖలో సముద్ర తీరం ఒకవైపు.. వైయస్‌ జగన్‌ అభిమాన జనసంద్రం ఒకవైపు ఉన్నాయని, ప్రజా సంకల్పయాత్రకు జన స్పందన కెరటంలా ఎగసిపడుతుందని వైయస్‌ఆర్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో ప్రజా సంకల్పయాత్రకు అద్భుతమైన ప్రజా స్పందన లభిస్తోందన్నారు. కంచరపాలెం మెట్టు వద్ద మరి కాసేపట్లో బహిరంగ సభ జరగబోతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకువచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు. 2014 ఎన్నికల్లో ఎందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయలేదని ఆవేదన చెందుతున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. వైయస్‌ జగన్‌ను ఎప్పుడు సీఎం చేద్దామనే ఆత్రుతతో ప్రజలంతా ఉన్నారన్నారు. పాదయాత్రకు ప్రజాభిమానం ఉప్పెనలా వెల్లువెత్తుతుందన్నారు. కంచరపాలెంలో జరిగే బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకుడికి ప్రజా స్పందన ఇంత లేదన్నారు.
 
విశాఖ భూ కబ్జాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని విజయసాయిరెడ్డి అన్నారు. వేల కోట్లు విలువ చేసే భూములు ఆక్రమించినా అబద్ధాల కోరు ముఖ్యమంత్రి కంటితుడుపు చర్యగా సిట్‌ విచారణ వేశారని, ఆ కమిటీ నివేదిక సమర్పించినా చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 2 వేల కోట్ల దోపిడీ జరిగిందని, వైయస్‌ఆర్‌ సీపీ అంచెనా ప్రకారం రూ. 5 వేల కోట్ల భూ కుంభకోణాలు జరిగాయన్నారు. భూకబ్జాలకు పాల్పడినవారంతా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులే కావడంతో చంద్రబాబు వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వారందరినీ కోర్టులో నిలబెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

విభజన చట్టంలోని హామీలను సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం, బీజేపీ జతకట్టి ప్రభుత్వాలు నడిపాయని, రాష్ట్ర విభజనకు కారుకులై చట్టంలో పెట్టిన అంశాలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు. 25 మంది పార్లమెంట్‌ సభ్యులను వైయస్‌ఆర్‌ సీపీకి ఇస్తే కేంద్రం ఎందుకు హామీలు నెరవేర్చదో చూస్తామన్నారు. విభజన సమయంలో కేబీకే తరహాలో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలను ఆదుకుంటామని చెప్పి వెనకడుగు వేశాయన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. 
Back to Top