విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన

హైద‌రాబాద్‌ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయింది. గురు, శుక్ర, శ‌ని వారాల్లో ఆయ‌న ప‌ర్య‌ట‌న సాగుతుంద‌ని పార్టీ కార్య‌క్ర‌మాల రాష్ట్ర కోర్డినేట‌ర్ త‌ల‌శిల ర‌ఘురామ్ వెల్ల‌డించారు. గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు జ‌గ‌న్ విశాఖ చేరుకొని, ఎల‌మంచిలి నియోజ‌క వ‌ర్గంలోని అచ్యుతాపురం కు వెళ‌తారు. ఇటీవ‌ల గోదావ‌రి మీద ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ ద‌గ్గ‌ర జ‌రిగిన ప్ర‌మాదంలో మృతి చెందిన వారి కుటుంబీకుడు ఈగ‌ల అప్పారావును ప‌రామ‌ర్శిస్తారు. అటు నుంచి తునిలోని పెరుమాళ్ల‌పురానికి వెళ్లి ఇటీవ‌ల వాయుగుండంలో గ‌ల్లంతైన మ‌త్స్యకారుల ఇళ్ల‌ను సంద‌ర్శిస్తారు. రాత్రికి కాకినాడ‌లో బ‌స చేసి శుక్ర‌వారం ఉద‌యం కాకినాడ‌, కాకినాడ రూర‌ల్ ప్రాంతాల్ని సంద‌ర్శిస్తారు. అక్క‌డ కూడా ఇటీవ‌ల గ‌ల్లంతైన మ‌త్స్యకారుల ఇళ్ల‌కు వెళ్లి కుటుంబాల్ని కలుసుకొంటారు. అదే రోజు రంప‌చోడ‌వ‌రంలోని సూరంప‌ల్లికి వెళ‌తారు. అక్క‌డ ఇటీవ‌ల ఓ వ్యాన్ బోల్తాప‌డిన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబీకుల‌ను ప‌రామ‌ర్శిస్తారు. శ‌నివారం ఉద‌యం గోపాల పురం నియోజ‌క‌వ‌ర్గంలోని దేవ‌ర‌ప‌ల్లి గ్రామంలో పొగాకు బోర్డు ప్రాంగ‌ణానికి వెళ్లి రైతుల స‌మ‌స్య‌ల్ని తెలుసుకొంటారు. త‌ర్వాత హైదరాబాద్ కు బ‌య‌లుదేర‌తార‌ని ర‌ఘురామ్ వివ‌రించారు.
Back to Top