లోకేష్‌ డైరెక్షన్‌లోనే విశాఖ భూ స్కాం

 • ఏం జరుగుతుందనడానికి సిగ్గుందా బాబూ
 • టీడీపీ దొంగల ముఠా చేతిలో ఆక్రమణకు గురవుతున్న లక్షల ఎకరాలు
 • కార్యాలయాల్లో ఉండాల్సిన రికార్డులు ఎలా మాయమవుతాయ్‌
 • హుద్‌ హుద్‌ తుఫాన్‌లో మీరు చేసిన అద్భుతం ఇదేనా బాబూ?
 • భూ స్కాంలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌
 • విశాఖ ప్రజలంతా ఉద్యమానికి సన్నద్ధం కావాలని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ పిలుపు

 • విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్‌ డైరెక్షన్‌లో విశాఖలో భూదందా జరుగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకొని తింటుంటే ఏమీ తెలియని నంగనాచిలా ఏం జరుగుతుందని అడుగుతున్నావ్‌ సిగ్గనిపించడం లేదా.. నీకు చంద్రబాబు అని బొత్స ప్రశ్నించారు. విశాఖలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు తెలుగుదేశం పార్టీ దొంగల ముఠా చేతిలో అన్యాక్రాంతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం చంద్రబాబు అలవాటుగా మారిపోయిందని, ఏ సంక్షోభం వచ్చినా దాన్ని అవకాశంగా మల్చుకుంటూ ఎన్నికల్లో డబ్బుల సంచులు మోసిన వారికి దోచిపెడుతూ, అవినీతికి పాల్పడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు విశాఖ కలెక్టర్‌కు ఫోన్‌ చేసి ఏం జరుగుతందని అడిగాడని పత్రికల్లో రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. విశాఖలో జరుగుతున్న అవినీతిపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనేక సందర్భాల్లో పోరాటాలు, ధర్నాలు చేసిందని గుర్తు చేశారు. 

  నిజాయితీ అధికారులను బదిలీ చేస్తారా..?
  తెలుగుదేశం పార్టీ దొంగల ముఠా పకడ్బందీగా ప్లాన్‌ చేసి లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి ప్లాన్‌ చేసిందని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. భిమిలీ ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట అమాయక ప్రజలను దోచుకుతింటున్నారని ప్రతిపక్షం పోరాటం చేస్తే పూలింగ్‌ ఆగిపోయిందన్నారు. ఆ తరువాత దస్‌పల్లా భూములు అన్యాయంగా దోచేస్తున్నారని, కలెక్టర్‌ వచ్చి అది ప్రభుత్వ భూమి అని ప్రకటిస్తే వెంటనే ఆ కలెక్టర్‌ను బదిలీ చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భూములు కేటాయించుకున్నారని దుయ్యబట్టారు. పత్రికలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు విశాఖలో వేలాది కోట్ల అవినీతి జరుగుతుందని మొత్తుకుంటున్నా.. ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. 233 గ్రామాల్లో ఉన్న లక్ష ఎకరాలకు సంబంధించిన ఎఫ్‌ఎంబీలు కనిపించడం లేదు. 400 రిజిస్టర్‌లు కనిపించడం లేదు. 3 లక్షల అడంగల్‌ కాపీలు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. కాపీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తే హుద్‌ హుద్‌ తుఫాన్‌లో కొట్టుకుపోయాయని బొంకుతున్నారన్నారు. హుడా పరిధిలోని భూముల రికార్డులు 7 కేంద్రాల్లో వివిధ రూపాల్లో ఉంటాయని బొత్స స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ, కమిషనరేట్, టౌన్‌ప్లానింగ్, కలెక్టరేట్, కార్పొరేషన్, పంచాయతీరాజ్‌ కార్యాలయాల్లో ఉంటాయన్నారు. కానీ ఇవాళ మాయం అయ్యాయని అంటున్నారంటే.. దీంట్లో ఎవరి హస్తం ఉందని బొత్స అధికారులను ప్రశ్నించారు. 

  ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా...?
  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శ్నించారు. ఇలాంటి భూ కుంభకోణాన్ని దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగివుండదన్నారు. ఈ భూ స్కాంల వెనుక ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు. హుద్‌ హుద్‌ తుఫాన్‌లో అద్భుతాలు చేశామంటున్న చంద్రబాబు ఇదా చేసిన అద్భుతం.. సిగ్గు అనిపించడం లేదా మీకు అని బొత్స ప్రశ్నించారు. ఒక మంత్రేమో రాజకీయ ప్రమేయం లేకుండా భూ స్కాం జరగదని, మరో మంత్రి గంటా వాస్తవాలు వెబ్‌సైట్‌లో పెట్టండి అని అధికారులకు చెబుతున్నారు.. దోపిడీ చేశాక వెబ్‌సైట్‌లో పెట్టడం ఏంటని పశ్నించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత విశాఖకు ఇది చేస్తా.. అది చేస్తామని మొసలి కన్నీరు కార్చి ఇలా దోచుకుతింటారా అని ముఖ్యమంత్రిని నిలదీశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో భూ కబ్జాలు జరిగితే.. వెంటనే వివాదంలో ఉన్నవారంరిపై ఆ సీఎం చర్యలు తీసుకున్నారన్నారు. కానీ మీరు లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంటే ఏం చేశారని చురకంటించారు.నవనిర్మాణదీక్ష చేసుకుంటూ మీరు చేసేది ఇదా.. అది నయవంచన దీక్ష అని ధ్వజమెత్తారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. విశాఖ భూ స్కాంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నారు. విశాఖ ప్రజలంతా మన భూములు మనం కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యంగా ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. అవినీతికి పాల్పడుతున్న నాయకులను తరిమి తరిమి కొట్టాన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ భూములను రక్షించేందుకు పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తప్పు చేసిన వారి నేరం రుజువు చేసి కక్కించే వరకు ఉద్యమిస్తామని భరోసా ఇస్తూ, ప్రజా ఉద్యమానికి ప్రజలంతా సన్నద్ధం కావాలని బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ పిలుపునిచ్చారు. 
Back to Top