విశాఖలో వైయస్‌ఆర్‌ సిపి 'మన కోసం'

విశాఖపట్నం, 3 అక్టోబర్‌ 2012: స్థానిక సమస్యల పోరాటానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కొత్త పంథాలో ముందుకు వచ్చింది. పరిష్కారం కాని సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేయడానికి విశాఖపట్నంలోని నాయకులు బుధవారం నుంచి 'మన కోసం' పేరిట వార్డుల్లో పాదయాత్ర ప్రారంభించారు. భారీగా వర్షం కురుస్తున్నా నాయకులు వార్డుల్తో పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. తొలుత 31 వార్డుల్లో స్థానిక సమస్యల గురించి వివరాలు సేకరిస్తున్నారు. పార్టీ నగర కన్వీనర్‌ వంశీకృష్ణ యాదవ్‌ నేత్వంలో మన కోసం పాదయాత్రను ప్రారంభించారు. గ్రేటర్‌ విశాఖలో సమస్యలు కోకొల్లలు. విశాఖ వాసుల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. వర్షం కురిసిందంటే చాలా వార్డుల్లో ఇబ్బందులు రాజ్యం ఏలుతుంటాయి. వారి సమస్యలపై పోరాటానికి వైయస్‌ఆర్‌ సిపి ముందుకు వచ్చింది.

విశాఖపట్నంలోని 31వ వార్డులో తోట రాజీవ్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ నాయకులందరం కలిసి 'మన కోసం' కాన్సెప్టుతో స్థానిక సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని ఆయన చెప్పారు. భారీ వర్షంలో కూడా స్థానికులు ఇంత అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చారంటేనే సమస్యలు ఎంత ఎక్కువగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. వార్డులో వర్షం పడిందంటేనే డ్రైనేజి పొంగిపోతుందన్నారు. సమస్యలు పరిశీలించి జివిఎంసి దృష్టికి తీసుకువెళతామని వంశీకృష్ణ చెప్పారు.

Back to Top