చంద్రబాబు విలన్ 2013: అంబటి

హైదరాబాద్ 02 ఆగస్టు 2013:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు  విజన్ 20:20అని చెప్పేవాడనీ, కానీ ఆయన విలన్ 2013అనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న ఉద్యమాన్ని అమ్మేయడానికి కాంగ్రెస్, టీడీపీల నేతలు ముసుగేసుకుని అందులో ప్రవేశిస్తున్నారనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ ఆయన హెచ్చరించారు. మహ్మద్ ఘోరీకి పృధ్వీరాజ్ చౌహాన్‌పై విజయం సాధించడానికి సహకరించిన జయచంద్రునితో చంద్రబాబును ఆయన పోల్చారు. కేంద్రానికి చంద్రబాబు సహకరించినందునే ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగిందని ఆయన స్పష్టంచేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. అంబటి ప్రసంగం ఆయన మాటల్లోనే...

ఉద్యమాన్ని అమ్మేయడానికి టీడీపీ, కాంగ్రెస్ యత్నం

'రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో ఉద్యమం  తీవ్ర రూపం దాలుస్తున్న దశ ఇది.  ఈ విభజనకు దోహదమూ, తెలుగు ప్రజలకు ద్రోహమూ చేసిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మరో డ్రామాకు తెరతీస్తున్నాయి. అదే రాజీనామా డ్రామాలు.  రాజీనామాలు పీసీసీ అధ్యక్షుడికి, సీఎంకి ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టాన వర్గం మాత్రం రాజీనామాలు చేయవద్దని సందేశాలు పంపుతోంది. రాజకీయ ద్రోహానికీ, నీచానికీ పాల్పడుతున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ముసుగు వేసుకుని  ఉద్యమంలో ప్రవేశించి అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈదశలో ఉద్యమకారులూ, వారికి మద్దతు పలుకుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రాన్ని విభజించమని చెప్పిందని కాంగ్రెస్, టీడీపీలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ దగ్గరే అధికారం ఉంది కాబట్టి, దానిష్టం వచ్చినట్లు చేయమని మా పార్టీ చెప్పినట్లు మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. మేం గాలిలో మాట్లాడలేదు. లేఖల ద్వారా మాట్లాడాం.. చంద్రబాబు గారు కూడా లేఖలిచ్చారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లేఖల సారాంశాన్ని మరోసారి మీ ముందుంచుతున్నాను. 'తెలంగాణల ప్రజల సెంటిమెంటును గౌరవిస్తున్నాం. ఆర్టికిల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా.. కలిపి ఉంచాలన్నా.. ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలు కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరిత గతిన ఈ సమస్యను ఓ తండ్రిలాగ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం మేం కోరుతున్నాం'.


జేఏసీకి స్వీటు తినిపించినప్పుడు అనుమానం రాలేదా!

అందరకీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చేశారా? లేక ఒక తండ్రిలాగ ప్రవర్తించారా? లేక అన్ని సమస్యలనూ పరిగణనలోకి తీసుకుని చర్చించారా?.. ఏమీ లేకుండానే మీరంతా ఈ లేఖలు ఇచ్చారు కదా అని  రాష్ట్రాన్ని రెండు భాగాలుగా నరికేశారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా మా పార్టీ చెప్పిందే చెబుతున్నారు. ఇలాంటి నిర్ణయం కేంద్రం తీసుకుంటుందని తెలియదనీ, ఈరోజు బాధపడుతున్నామనీ ఓ కేంద్ర మంత్రి చెబుతున్నారు. ఎవర్ని మోసం చేయడానికి ఇలాంటి మాటలు అని అడుగుతున్నా. విభజన అనివార్యమని పత్రికల్లో వార్తలు వస్తున్న తర్వాత మాకేం తెలియదంటున్నారే? తెలంగాణ జేఏసీ వెళ్లినప్పుడు దిగ్విజయ్ సింగ్ వారికి స్వీటు తినిపించి త్వరలో తీపి కబురు చెబుతామన్నాడు. సీమాంధ్ర మంత్రులు కలిసినప్పుడు స్వీటు తినిపించి, మీకు అన్యాయం కలగకుండా చూస్తామని ఆయన చెప్పలేదే. ఆరోజున విభజన తథ్యమని మీరెందుకు గమనించలేదు. ఈ పరిస్థితులను గమనించిన మా శాసన సభ్యులు జులై 17న కేంద్రానికి ఓ లేఖ రాశారు. ముందు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలనీ, తరువాత మిగిలిన పార్టీలు చర్చలో పాల్గొనాలనీ చెప్పాం. విభజన అనివార్యమైనప్పుడు అన్ని పార్టీలను పిలిచి అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొని ఉంటే ఈరోజు రాష్ట్రం ఇలా అగ్నిగుండమై ఉండేది కాదు.

తెలంగాణ సమస్య పుట్టినప్పుడు పుట్టిన పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ కాదు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చినప్పుడు కూడా మా పార్టీ పుట్టలేదు. అయినప్పటికీ విజ్ఞతతో, ముందు చూపుతో ఆలోచించి అంత స్పష్టంగా చెప్పాం. మిగిలిన రాజకీయ పార్టీలు ఇప్పుడు మా విధానాన్నే పాటిస్తున్నాయి. దీన్ని గమనించకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. దిగ్విజయ్ సింగ్ లాంటి బాధ్యత గల వ్యక్తి ఓ పక్కన చిచ్చుపెట్టి.. గుంటూరు లేదా ఒంగోలు లేదా మరో చోట మీరో రాజధాని నిర్మించుకోవచ్చంటూ వ్యాఖ్యానించడం వెనుక ఉద్దేశం ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ కెరటాన్ని చీల్చే యత్నమే. ఏమిటి దౌర్భాగ్యం. బ్రిటిష్ వాడు విభజించి పాలించమన్నాడు. స్వతంత్ర ఉద్యమం ఎప్పుడుపుట్టిందో మనందరికీ తెలుసు.

1905లో బెంగాల్ రాష్ట్రాన్ని చీల్చినప్పుడు ఉవ్వెత్తున ఉద్యమం లేచి స్వాతంత్ర్య పోరాటం ఓ కీలక మలుపు తీసుకుంది. ఆ మహోద్యమంలో పుట్టిందే ఈ కాంగ్రెస్ పార్టీ. అదే పార్టీ విభజించి పాలించడమనే సూత్రాన్ని పాటిస్తోంది.  అలాంటి పార్టీకి మీ ఇష్టం విభజించుకోండంటూ చంద్రబాబు బ్రహ్మాండమైన బ్లాంక్ చెక్ లాంటి కాగితం అందించాడు.  ఆ చంద్రబాబు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు జెండాలు పట్టుకుని తిరుగుతూ, రాజీనామాలు చేస్తున్నారు. అవి నిజం రాజీనామాలా.. డమ్మీ రాజీనామాలా? విభజన ప్రకటన వచ్చిన 19 గంటల తర్వాత బయటకొచ్చిన చంద్రబాబు ఫలానా ప్రాంతానికి అన్యాయం జరిగిందంటూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కొత్త రాజధాని గురించి మాట్లాడారు. నాలుగైదు కోట్ల రూపాయల ఖర్చవుతుందని లెక్కలేసిన పెద్దమనిషికి చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులు జెండాలు పుచ్చుకుని తిరగడమేమిటి? ఉద్యమం ఉవ్వెత్తున్న లేచింది కాబట్టి అందులో ప్రవేశించి దాన్ని ముంచేయాలని ప్రయత్నిస్తున్నారా? ఈ రాష్ట్రం చీలిపోవడానికి కారణం కాంగ్రెస్, టీడీపీలే. చంద్రబాబునాయుడు గారు ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖ ఏమిటి? ఆ లేఖకే కట్టుబడి ఉన్నామని మొన్న షిండే దగ్గర మాట్లాడిన విషయం మరిచారా? ఇప్పుడు చాలా బాధ పడుతూ కంటనీరు పెట్టుకున్నారు.. అది కాదు మీరు చేయాల్సింది చంద్రబాబుని నిలదీయాలి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని నమ్మరు.

చంద్రబాబుకు జయచంద్రునితో పోలిక
పృధ్వీరాజ్ చౌహాన్ని ఓడించడానికి మహ్మద్ ఘోరీ 16సార్లు ప్రయత్నించి ఓడిపోయాడు. 17వ సారి అతడి రాజ్యానికే చెందిన జయచంద్రుడు రహస్యాలను చెప్పడంతో ఘోరీ విజయం సాధించాడు. చంద్రబాబు కూడా జయచంద్రుడిలాగ కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై రాష్ట్రాన్ని చీల్చడానికి కారకుడయ్యాడు. జయచంద్రుడు, చంద్రబాబు ఇద్దరూ చరిత్రలో నిలిచిపోతారు. చంద్రబాబుది విజన్ ట్వంటీ అనుకుంటాం.. అలాగని చాలామంది ప్రచారమూ చేశారు. కానీ చంద్రబాబు విలన్ 2013. విభజన ప్రకటన వెలువడక ముందే కాంగ్రెస్ హైకమాండ్‌తో చంద్రబాబు కాంటాక్టులో ఉన్నారట. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఈ విషయాన్ని అనేక ఇంగ్లీషు పత్రికలు చెప్పాయి. అహ్మద్ పటేల్, సోనియాగాంధీలని కలిసి అధిష్టాన నిర్ణయమే మాకు సమ్మతం అని చెప్పిన కేంద్ర మంత్రులు ఈరోజు మాకు అన్యాయం జరిగిపోయిందని గుండెలు బాదుకోవడం ఎంత వరకూ సమంజసం? మేం పార్లమెంటులో ఉంటే న్యాయం జరుగుతుందంటున్నారు.. ఏం న్యాయం చేకూరుతుందని ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చింది. చంద్రబాబు పార్టీ జీవచ్ఛవంలా ఉంది.  మా ప్రాంతంలో దింపుడు కళ్ళెం అంటారు. శవాన్ని స్మశానానికి తీసుకెళ్లేటప్పుడు మధ్యలో రెండుమూడుసార్లు దించి తడుతుంటారు.. మళ్ళీ బతుకుతారేమోనని.. అలాంటి ఆశతో తమ పార్టీలని బతికించుకోవడం కోసం కాంగ్రెస్, టీడీపీ నేతలు ముసుగు తగిలించుకుని నీరుగార్చడానికి ఉద్యమంలో చేరుతున్నారు. ఈ రకంగా మరోసారి మనల్ని ముంచేసి, ఉద్యమాన్ని అమ్మేయడానికి మీ మధ్యకు వస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.

వనరులు ఎన్నో ఉన్నాయనీ, వాటన్నింటినీ సీమాంధ్రులు వాడేసుకోవచ్చనీ చెబుతున్నారు. అందరూ ఎన్నో మాట్లాడుతున్నారు. పాపం చంద్రబాబు గారు మాట్లాడే పరిస్థితో లేడు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామాలు చేసి వస్తున్నారు. ఇదంతా డ్రామా అని ప్రజలంతా గమనించాలి.'

తాజా ఫోటోలు

Back to Top