*మరో పార్టీలో వైయస్‌ఆర్‌సిపి విలీనమయ్యే ప్రశ్నే లేదు*విజయమ్మ మాటలను పీటీఐ విలేకరి వక్రీకరించారు*ఆ విలేకరిపై పీటీఐకి ఫిర్యాదు చేస్తాం*లౌకికవాద పార్టీలతోనే పొత్తు ఉంటుందని, అది భవిష్యత్తులో నిర్ణయిస్తామని చెప్పారు*విలీనం గురించిన ప్రస్తావనే రాలేదు*కాంగ్రెస్‌లో విలీనమయ్యే ప్రసక్నే లేదని జగన్ గతంలో పలుమార్లు స్పష్టం చేశారుహైదరాబాద్, 9 సెప్టెంబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవుతుందంటూ వస్తున్న కథనాలన్నీ కట్టు కథలేనని పార్టీ అధికార ప్రతినిధులు గట్టు రామచంద్రరావు, జనక్‌ప్రసాద్ చెప్పారు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ వారి ఆదరాభిమానాలు చూరగొంటున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రెండు రోజుల పాటు చేసిన ‘ఫీజు దీక్ష’ విజయవంతం కావడంతో జడుసుకున్న కొన్ని శక్తులు దానిని తక్కువ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ విలీనం కాబోతోందంటూ ఒక వర్గం మీడియా ప్రసారం చేస్తున్న పిచ్చి కథనాలు ఆ శక్తుల కుట్రలో భాగమేనని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇంటర్వ్యూలో విజయమ్మ చెప్పిన మాటలను పీటీఐ విలేకరి పూర్తిగా వక్రీకరించారని తెలిపారు. పార్టీ విధానంపై విజయమ్మ చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ, ఆ విలేకరి వక్రీకరించడం శోచనీయమన్నారు. ‘పీటీఐ విలేకరి విజయమ్మను అడిగిన ప్రశ్నే స్పష్టంగా లేదు. కాంగ్రెస్‌తో విలీనం, పొత్తు అంటూ చిత్ర విచిత్రంగా ప్రశ్నించారు. అయినా విజయమ్మ దీనిపై స్పష్టంగా మాట్లాడారు. బీజేపీలాంటి మతతత్వ పార్టీలతో పొత్తు ఉండదని గతంలో జగన్ చెప్పిన మాటను గుర్తుచేస్తూనే.. లౌకికవాద పార్టీలతోనే పొత్తు ఉంటుందని, అది కూడా భవిష్యత్తులో నిర్ణయిస్తామని సమాధానమిచ్చారు. ఇందులో విలీనం గురించి ఎక్కడా ప్రస్తావనే లేదు. ఒకవేళ విలీనమనే మాటే వస్తే మధ్యలో బీజేపీ గురించి ప్రస్తావనే రాదుకదా’ అని గట్టు అన్నారు. పీటీఐ వంటి సంస్థ నుంచి ఇలాంటి వక్రీకరణ కథనం రావడం దురదృష్టకరమన్నారు. తప్పుడు కథనం రాసిన విలేకరిపై చర్య తీసుకోవాలని ఆ వార్తా సంస్థకు ఫిర్యాదు చేస్తామని గట్టు చెప్పారు.మొదటి నుంచీ ఒక వర్గం మీడియా తమ పార్టీపై కట్టుకథలు అల్లుతోందన్నారు. 'యూ ట్యూబ్'లో ఉన్న ఓ కట్టుకథను పట్టుకొని అదే పనిగా ఆ వర్గం మీడియా ప్రసారం చేస్తోందని దుయ్యబట్టారు. ‘విలేకరి ఇంటర్వ్యూ చేయడం, దాన్నే ఒక చానల్ ప్రసారం చేయడం, ఆ వెంటనే దానిపై టీడీపీ చర్చకు తెరలేపడాన్ని బట్టి చూస్తే ఈ ముగ్గురూ కలిసి కుట్ర చేసినట్టు ఉందని గట్టు సందేహం వ్యక్తంచేశారు. ఒక చానల్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వణికిపోయే సమస్యే లేదని చెప్పారు. తమ పార్టీపై ఇప్పటికి కొన్ని వందలసార్లు దుష్ట్రచారం చేసినా ప్రజలు ఏనాడూ నమ్మలేదని గుర్తు చేశారు.కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనమయ్యే ప్రసక్తే ఉండదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి అనేకసార్లు స్పష్టంగా చెప్పారని తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని, ప్రజారాజ్యం పార్టీలాగా తాము ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టబోమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్లీనరీలోనే జగన్ విస్పష్టంగా చెప్పారని అన్నారు. అయినా ఒక వర్గం మీడియా తమ పార్టీపై తప్పుడు కథనాలతో దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లడం జరగని పని అని ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జగన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని తెలిపారు. ఎన్నికల అనంతరం అవసరమైతే ఇతర పార్టీలతో పొత్తుల గురించి ఆలోచిస్తామని మాత్రమే జగన్ ముందు నుంచీ చెబుతున్నారని అన్నారు. అది కూడా బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని చెప్పారని తెలిపారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం శరద్ పవార్‌తోనైనా, ములాయంతోనైనా, మమతతోనైనా చివరకు కాంగ్రెస్ పార్టీతోనైనా పొత్తు తమకు అంగీకారమేనని జగన్ చెప్పారని తెలిపారు.ఎన్ని జాకీలతో బాబును ఎత్తినా నిష్ప్రయోజనం: జనక్ ప్రసాద్ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబును యెల్లో మీడియా ఎన్ని జాకీలతో ఎత్తినా ప్రయోజనం ఉండదని జనక్‌ప్రసాద్ ఎద్దేవా చేశారు. మీరు ఊడిగం చేసే పార్టీని ఎంతైనా ఆకాశానికి ఎత్తుకోండి కానీ, మరో పార్టీని వెంటాడి వేటాడి తరుముకుంటా రావడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఒక పార్టీకి ఊడిగం చేస్తూ, మరొక పార్టీపై అసత్య ప్రచారం చేయడమేనా దమ్మున్న చానల్ విధానం అని నిలదీశారు.