విధుల్లోకి సీపీ...కాల్ మనీ కేసు విచారణ

విజయవాడః నగర సీపీ గౌతం సవాంగ్ సెలవు రద్దు చేసుకొని విధుల్లో హాజరయ్యారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసు నుంచి టీడీపీ నేతలను తప్పించేందుకు..సిన్సియర్ ఆఫీసర్  గౌతం సవాంగ్ ను సెలవుపై పంపించాలన్న చంద్రబాబు ప్రయత్నం బెడిసికొట్టింది. కేసు తీవ్రత  దృష్ట్యా సెలవు రద్దు చేసుకున్నట్లు సవాంగ్ తెలిపారు. కాల్ మనీ కేసు విచారణ సాగుతుందని ఇప్పటివరకు 107 ప్రాంతాల్లో సోదాలు జరిపామని పోలీస్ కమిషనర్ సవాంగ్ తెలిపారు. ఇప్పటివరకు 75 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ప్రకటించారు.


ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసును విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ వెలుగులోకి తెచ్చారు. చంద్రబాబు తమ్ముళ్లను కేసు నుంచి కాపాడాలన్న తాపత్రయంతో  ... ముక్కుసూటి వ్యక్తిగా పేరున్న సవాంగ్ ను సెలవుపై వెళ్లేలా  రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చారు.  ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి సురేంద్రబాబుకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు.  కాల్ మనీ కేసు నీరుగార్చేందుకు కుట్రలు జరుగుతుండడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు.  కాల్ మనీ కేసు విచారణను మీరే చేపట్టాలంటూ బాధితులు సవాంగ్ కు విన్నవించుకోవడంతో ..ఆయన తన ఆలోచనను విరమించుకుని విధులకు హాజరయ్యారు.  

కాల్ మనీ కేసుకు సంబంధించి గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే..  కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అది పూర్తయ్యేవరకు దీని గురించి మాత్రం ఏమీ చెప్పలేను. ఈ కేసులో మోసం, ఎక్స్‌టార్షన్, అన్నీ ఉన్నాయి. డాక్యుమెంట్లు తీసుకోవడం, ఖాళీ పత్రాల మీద సంతకాలు తీసుకోవడం తగదు. సీపీ కార్యాలయం గేటు దగ్గరకు చాలా మంది వస్తున్నారు. ఇది పెద్ద సమస్య. దీన్ని తప్పకుండా పరిష్కరిస్తాం. ఇందులో పెద్ద మొత్తాలు ఉన్నాయి కాబట్టి ఆదాయపన్ను శాఖ అధికారులకు కూడా విషయం చెప్పాల్సి ఉంటుంది'' అని సీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు.



Back to Top