విజయమ్మ లేఖకు ఆర్బీఐ గవర్నరు స్పందన

హైదరాబాద్:

నాణేలు, కరెన్సీ నోట్లు, పాత, చినిగిపోయిన నోట్ల మార్పిడి వంటి సేవలను అందిస్తున్న రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాలలోని పబ్లిక్ కౌంటర్ల కార్యకలాపాలను వాణిజ్య బ్యాంకుల ద్వారా నిర్వహిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపారు. దీనివల్ల ఈ సేవలు సామాన్య ప్రజలకు మరింతగా అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు. పబ్లిక్ కౌంటర్ల మూసివేత తగదంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గత డిసెంబరు 28న రాసిన లేఖకు స్పందిస్తూ దువ్వూరి సుబ్బారావు పైమేరకు లేఖ పంపారు. ఈ కౌంటర్ల మూసివేత వల్ల వాటిలోని సిబ్బంది ఉపాధికి ఎటువంటి ఢోకా ఉండదని ఆయన స్పష్టంచేశారు. ఆ సిబ్బందిని వాణిజ్య బ్యాంకులలో సేవలకు ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాలలోని పబ్లిక్ కౌంటర్లను మూసివేస్తే ప్రజలు ఎంతో ప్రయోజనకరమైన సేవలకు దూరమవుతారనే విషయాన్ని ఆర్‌బీఐ గవర్నరు దృష్టికి తెస్తూ శ్రీమతి వైయస్ విజయమ్మ లేఖ పంపారు. కౌంటర్ల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవలసిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. నాణేలు, కరెన్సీ నోట్లు, పాత, చినిగిపోయిన నోట్లు మార్పిడి వంటి సేవలకు ఈ పబ్లిక్ కౌంటర్లు ప్రయోజనకరంగా ఉన్నాయనీ, వాటిని మూసివేయాలన్న నిర్ణయం సరికాదని శ్రీమతి విజయమ్మ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖకు స్పందించి రిజర్వు బ్యాంకు గవర్నరు సుబ్బారావు సమాధానం పంపారు.

తాజా వీడియోలు

Back to Top