ఐకేపీ ఉద్యోగుల సమస్యలు తీర్చండి

హైదరాబాద్ 21 జూన్ 2013:

ఇందిరా క్రాంతి పథంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ముకు ఆమె ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను పేదలకు అందించడంలో ఐకేపీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారనీ, ఇందులో 6533మంది ఉద్యోగులున్నారనీ తెలిపారు. పదమూడేళ్ళుగా వీరికి వేతనాలను పెంచలేదన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ప్రతి వ్యక్తీ ఆత్మగౌరవంతో జీవించే అవకాశాన్ని కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యతని ఆమె గుర్తుచేశారు. ఐకేపీ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. నానాటికీ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం కారణంగా నెలసరి వేతనంతో రెండుపూటలా కడుపునింపుకునే పరిస్థితి లేక ఐకేపీ ఉద్యోగులలో నిరాశ, నిస్పృహలు గూడుకట్టుకున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణ చొరవ చూపి వారి డిమాండ్లను పరిష్కరించాలని ఆమె ఆ లేఖలో డిమాండ్ చేశారు.

Back to Top