'సౌదీ' సంక్షోభ నివారణకు చర్యలు చేపట్టాలి

హైదరాబాద్ 21 జూన్ 2013: స్థానికులకు ఉద్యోగావకాశాలను పెంచాలన్న నిశ్చయంతో సౌదీ అరేబియా, కువైట్ దేశాలు తీసుకున్న నిర్ణయం కారణంగా మన రాష్ట్రానికి ఎదురయ్యే సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనడానికి తక్షణ చర్యలు చేపట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రినుద్దేశిస్తూ ఓ లేఖ రాశారు.
లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది..

గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారికి,

స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో  సౌదీ అరేబియా నితఖత్ చట్టాన్ని అమలుచేయనుండగా.. కువైట్ దేశం కూడా అదే బాటన పట్టనుంది. ఈ పరిస్థితులలో అక్కడ పనిచేస్తున్న తెలుగువారు భారీ సంఖ్యలో తిరుగుముఖం పట్టే అవకాశముంది. వలస కార్మికులు అవసరమైన పత్రాలను సమర్పించేందుకు ఆయా దేశాలు జౌలై మూడో తేదీని గడువుగా నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో వచ్చే రెండుమూడు నెలల్లో  సుమారు లక్షా యాబైవేల మంది మన దేశానికి తిరిగి వచ్చే ప్రమాదముంది. దీనికి పరిష్కారం ఆలోచించకుంటే దేశానికి విదేశీ నిధుల రాక తగ్గడమే కాక నిరుద్యోగులు పెరిగి సామాజిక, ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశముంది.
ఇదే అంశంపై గత నెల 17న గౌరవనీయ ప్రధానమంత్రికి లేఖ రాశాను. విదేశీ వ్యవహారాలు, ప్రవాస భారతీయ మంత్రిత్వ శాఖలు ఆయా దేశాలపై దౌత్యపరమైన వత్తిడి తెచ్చి, వీసాల గడువు పెంపునకు..దశలవారీగా వారు దేశానికి గౌరవంగా తిరిగి వచ్చేలా చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశాం. కానీ ఈ భారాన్ని విదేశీ వ్యవహారాల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంచిందని మీడియా వార్తల ద్వారా తెలుసుకున్నాను.

సౌదీ అరేబియాలో ఉన్న ఆరు లక్షల మంది, కువైట్‌లో ఉన్న లక్షన్నరమంది రాష్ట్రవాసుల గురించి నేను ఆందోళన చెందుతున్నాను. వీరిలో చాలామంది కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ పాత బస్తీ, వైయస్ఆర్ కడ, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన సెమీ స్కిల్డ్ కార్మికులున్నారు. లక్షన్నర మంది ఒకేసారి తిరిగి వస్తే రాష్ట్రంలో ఏర్పడే సంక్షోభం ఊహాతీతం.

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కింది చర్యలు చేపట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. 1) నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాస భారతీయులు జరిమానాలు చెల్లించాలని ఒత్తిడి తేకుండా ఆయా దేశాలతో మన విదేశీ వ్యవహారాల శాఖ, ప్రవాస భారతీయ శాఖ నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. 2) దశలవారీగానూ గౌరవప్రదంగానూ స్వదేశానికి తిరిగి వచ్చే ఏర్పాట్లు చేయాలి. 3) నష్టపోయినవారికి దేశానికి తిరిగి వచ్చేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. 4) తిరిగి వచ్చేవారికి ఉపాధి, తగిన శిక్షణ కల్పించేందుకు వీలుగా ఒక రివాల్వింగ్ ఫండ్ నెలకొల్పాలి. 5) తిరిగి వచ్చిన వారు వారికి అనుభవమున్న రంగంలో ప్రత్యామ్నాయ ఉపాధి పొందేందుకు సహకారం అందించాలి.  6)  వీరికి ఉద్యోగావకాశాలు కల్పించడంలో రిజిష్టరయిన ఏజెన్సీలను తప్పని సరిచేయాలి. దీనివల్ల దళారులను వీరి దరిచేరనీయకుండా చూడటం సాధ్యమవుతుంది.

ఇదే పరిస్థితి మిగిలిన గల్ఫు దేశాలలోనూ ఉత్పన్నమయితే అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలి. ఇలా తిరిగొచ్చిన కార్మికులు ఉపాధి లభించక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించుకోవాలి.
విశ్వసనీయురాలు
వైయస్ విజయమ్మ

Back to Top