25నుంచి తెలంగాణలో విజయమ్మ పర్యటన

హైదరాబాద్, 17 జూన్ 2013:

స్థానిక ఎన్నికలను పురస్కరించుకుని పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. సోమవారం ఉదయం రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైందని చెప్పారు. సమావేశ వివరాలను ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం మీడియాకు వివరించారు.  స్థానిక ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడానికి శ్రీమతి విజయమ్మ ఇప్పటికే తిరుపతి, విజయనగరం పట్టణాలలో పార్టీ ప్రాంతీయ సమావేశాలను ఏర్పాటుచేసి దిశానిర్దేశం చేసిన విషయాన్ని బాజిరెడ్డి గుర్తుచేశారు. పార్టీ శ్రేణులు  సమైక్యంగా పనిచేసి విజయం సాధించేందుకు కృషి చేయాలని ఆమె కోరారన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీమతి విజయమ్మ తెలంగాణలో లోని అన్ని జిల్లాలలో పర్యటిస్తారని చెప్పారు. ఇందులో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు. శ్రీమతి విజయమ్మ ఈ నెల 25న మెదక్, 26న నల్లగొండ, 27న మహబూబ్ నగర్, 28న ఖమ్మం,   29న  రంగారెడ్డి, 30న  కరీంనగర్, జూలై 1న వరంగల్,  2న ఆదిలాబాద్,   3న నిజమాబాద్ జిల్లాల్లో పర్యటించాలని పీఏసీ నిర్ణయించిందన్నారు. పార్టీ ఆదేశాలను పాటించి, పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పాల్గొనాలని ఆయన కోరారు.  

వచ్చే నెల 8న పార్టీ ప్లీనరీ
జూలై 8న ఇడుపులపాయలో పార్టీ ప్లీనరీ నిర్వహించాలని రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించిందన్నారు. స్థానిక  ఎన్నికల నేపథ్యంలో దీనిని ఒక్కరోజే నిర్వహిస్తామన్నారు. ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షుని ఎన్నికుంటామని తెలిపారు.

గంగానదికి సంభవించిన వరదల కారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న వందలాదిమంది తెలుగు వారిని  కాపాడాలని పీఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందన్నారు.  వారిని వారివారి  ప్రాంతాలకు సురక్షితంగా చేర్చాలని కోరారు.

ఇచ్చాపురంలో పైలాన్
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర జులై నెల చివరి వారంలో  3000 కిమీ. పూర్తికానున్న సందర్భంగా ఇచ్చాపురంలో పైలాన్ నిర్మించాలని రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించినట్లు బాజిరెడ్డి తెలిపారు.  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సభ ఇచ్చాపురంలోనా.. విజయనగరంలోనా అనే విషయాన్ని తదుపరి ప్రకటిస్తామని చెప్పారు.


జనార్దన్‌కు వ్యక్తిగత అజెండా
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బోడ జనార్దన్‌కు‌  వ్యక్తిగత అజెండా ఉందనీ, దీని కారణంగానే ఆయన తమ పార్టీకి రాజీనామా చేశారనీ బాజిరెడ్డి తెలిపారు. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారన్నారు. తమ పార్టీలోకి రాగానే  ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చామన్నారు. ఆయన కోరిన బెల్లంపలి ఎమ్మెల్యే సీటిస్తామని కూడా చెప్పామన్నారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ అడిగితే ఆలోచిస్తామని చెప్పామన్నారు. అయినప్పటికీ వెళ్ళిపోతూ తమ పార్టీపై బురద జల్లడం సరికాదని హితవు పలికారు. ఆయన చెప్పినట్లు టీఆర్ఎస్ పార్టీతో తమకు  లోపాయకారీ ఒప్పందం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఆయన ఏమాశించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారో అర్థం కావడం లేదన్నారు. ఆయనతో పాటు పార్టీని  సోయం బాబూరావు.. ఆదివాసి సోదరుడు.  ఉన్నత వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపించడం తగదన్నారు. రిజర్వుడు నియోజకవర్గం కాబట్టి టికెట్ ఆయనదేనన్న విషయాన్ని విస్మరించారన్నారు. వెళ్ళేముందు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వారు తమ పార్టీపై వేసిన  అభాండాలను వారి విజ్ఞతకూ, ప్రజలకు విడిచిపెడుతున్నామని బాజిరెడ్డి స్పష్టంచేశారు.

తాజా వీడియోలు

Back to Top