చెవిరెడ్డి చేపట్టే కార్యక్రమాలకు వెన్నంటి ఉంటా



 
తిరుపతి  : ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలను సైతం ఎమ్మెల్యే చెవిరెడ్డి సొంత నిధులతో చేపట్టడం అభినందనీయమని, చెవిరెడ్డి చేపట్టే కార్యక్రమాలకు తాను వెన్నంటి ఉంటానని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. క్రీడలతో పాటు వందలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో యువత బంగారు భవిష్యత్తుకు వైయ‌స్ఆర్‌  గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమాలు, భారీ టోర్నమెంట్లతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి యువతకు ఐకాన్‌గా మారారని కొనియాడారు. టోర్నమెంట్‌ వద్దే యువత నుంచి ఉపాధి కోసం బయోడేటాలు స్వీకరించడం హర్షణీయమన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామం తుమ్మలగుంట లో నిర్వహిస్తున్న వైఎస్సార్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ పదో రోజు ఉత్కంఠభరితంగా కొనసాగింది. పోటీలకు విజయసాయిరెడ్డితోపాటు తిరుపతి ఎంపీ వరప్రసాద్,  వైయ‌స్ఆర్‌సీపీ  తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్‌ ఎల్‌బీ ప్రభాకర్‌నాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

సరదాగా బ్యాటింగ్, బౌలింగ్‌ చేస్తూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో కలిసి బైక్‌ నడుపుతూ పది మైదానాల్లో జరుగుతున్న పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను అభినందించారు. మెడల్స్, సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలను సైతం ఎమ్మెల్యే చెవిరెడ్డి సొంత నిధులతో చేపట్టడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్‌కు తనవంతుగా రూ.5 లక్షలను అం దిస్తానని తెలిపారు. యువతను ప్రోత్సహించే ఇలాంటి టోర్నమెంట్లను ప్రతి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా తాను మోడల్‌ జిల్లాగా ఎంచుకున్న వైజాగ్‌లో చెవిరెడ్డి సహకారంతో ఇలాంటి టోర్నమెంట్‌ను త్వరలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. చెవిరెడ్డి చేపట్టే కార్యక్రమాలకు తాను వెన్నంటి ఉంటానని, చంద్రగిరి నియోజకవర్గం లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంపీ నిధులతో ఆరు వాటర్‌ ట్యాంకర్లను అందిస్తానని ప్రకటించారు. 

Back to Top