విజయ్‌మాల్యాతో చంద్రబాబుకు సంబంధాలు


2016 మార్చిలో బాబు లండన్‌ వెళ్లి మాల్యాను కలిశారు
వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి
వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్న

ఢిల్లీ: దేశ ఆర్థిక నేరగాడు విజయమాల్యాతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. 2016 మార్చి 1వ తేదీన విజయ్‌మాల్యా రాజ్యసభలో ఉన్నారని, మరుసటి రోజే దేశం విడిచి వెళ్లిపోయారన్నారు. తరువాత పది రోజులకు చంద్రబాబు లండన్‌ వెళ్లి మాల్యాను కలిశారన్నారు. 2016 మార్చి 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు విజయమాల్యాను కలిసి చర్చలు జరిపారో లేదో.. సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా 2009, 2014 ఎన్నికల్లో విజయ్‌మాల్యా నుంచి చంద్రబాబు రూ. 150 కోట్లు విరాళంగా తీసుకున్నారో లేదో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు . ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఇవన్నీ వాస్తవాలేనని ధ్రువీకరించాల్సి వస్తుందన్నారు. ఆర్థిక నేరగాళ్లతో సంబంధం పెట్టుకున్న చంద్రబాబు ఇతరులపై నిందలు వేయడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు పార్లమెంటరీ సంప్రదాయాలను మంటగలిపారని ప్రివిలేజ్‌ మోషన్‌ నోటీసును రాజ్యసభ చైర్మన్‌కు అందించినట్లు సాయిరెడ్డి చెప్పారు. 

రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చర్చ జరగనివ్వకుండా టీడీపీ సభ్యులు ఆటంకం కలిగించారని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రాజ్యసభలో చర్చకు తీసుకురావాలని నోటీసులు ఇస్తే టీడీపీ ఎంపీలు అడ్డంకులు సృష్టించారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో అన్ని రాజకీయ పక్షాలతో కలిసి విడాకులు ఇచ్చిన చంద్రబాబు తిరిగి ఎన్డీయే నుంచి కూడా బయటకు వచ్చి కొత్త భాగస్వామిని వెతుక్కుంటూ వస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబుతో జతకట్టిన పార్టీలన్నీ నాలుగేళ్ల దుర్మార్గపు పాలన, ఓటుకు కోట్ల కేసు, విజయవాడలో సెక్స్‌రాకెట్, రాజధాని భూ కుంభకోణం, పోలవరం అవినీతి మరిచి దుర్మార్గపు ముఖ్యమంత్రితో జతకడతారా.. అని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలన్నారు. రెండు రోజుల క్రితం ఒక టీవీ ఇంటర్వ్యూలో సుజనా చౌదరి మోడీని కలిసినందుకు తప్పుబట్టాడని, మీరు ఆర్థిక మంత్రిని ఎందుకు కలిశారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేశాడన్నారు. హోదా సాధించాలనే చిత్తశుద్ధి, ప్రజల అభివృద్ధి పట్ల కాంక్ష టీడీపీకి లేవని, ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 
Back to Top