విద్యుత్తు కోతలపై క్షమాపణ చెప్పాలి

హైదరాబాద్, 01 మార్చి 2013:

విద్యుత్తు కోతలపై ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కోతలపై ప్రకటన చేసి వాటిని అధికారికం చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటివరకూ అనధికార కోతలు అమలవుతున్నాయన్నారు. వర్షాకాలంలో కూడా కరెంటు సరఫరాలో కోత విధించిన విషయం తెలిసిందేనన్నారు. ఇన్ని గంటలు కోతలు విధించే బదులు అసలు కరెంటు ఇవ్వలేమని ప్రకటిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వీలుంటుందన్నారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీయేననీ, గత అరవై ఏళ్ళలో ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ నెలకొనలేదనీ ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల కారణంగా రైతు అష్టకష్టాలూ పడుతున్నాడన్నారు. చేతికందిన పంట ఎండిపోతుంటే చేసేది లేక తగులబెట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి పది నుంచి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యుత్తు ప్రాజెక్టుల  మీద ఆధారపడుతున్నందువల్లే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. పరిశ్రమలు మూతపడి, లక్షలాదిమంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. వీటి సంగతి చెప్పడం మాని లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వం చెప్పుకుంటోందన్నారు. రైతులకు మేలు చేకూర్చలేని ప్రభుత్వం ఓసారి తనను తాను ప్రశ్నించుకోవాలన్నారు. పదవీ వ్యామోహంతో పనిచోస్తోందన్నారు. అధికార దుర్వినియోగం చేస్తోందన్నారు. ఇందుకు కడప డీసీసీబీ ఎన్నికే ఉదాహరణన్నారు. ఓ అధికారినే కిడ్నాప్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చన్నారు. ప్రజలు ఎలా పోయినా తమ పబ్బం గడిస్తే చాలనేలా ఉందన్నారు. అధికారంలో ఉన్నంత కాలం అనుభవించాలనే తపన కాంగ్రెస్ నేతలలో కనిపిస్తోందన్నారు.

     అధికారులు ఈ అంశాలను ఆలోచించుకోవాలనీ, ఎవరి ఒత్తిళ్ళకూ భయపడాల్సిన అవసరం లేదనీ శ్రీకాంత్ రెడ్డి కోరారు. అధికారులు బాగుండాలని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అనుక్షణం తపించారని చెప్పారు. చంద్రబాబు తన హయాంలో అధికారులకు డీఏ కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అలాగే, రిలయన్సు నుంచి గ్యాస్ తెచ్చి రైతులకు తొమ్మిది గంటల కరెంటు సరఫరా ఇవ్వడానికి నిరంతరం ప్రయత్నించారని పేర్కొన్నారు.

     టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇప్పడు పుట్టిన ప్రతి ఆడపిల్లకూ 25 వేల రూపాయలు చొప్పున ఎఫ్‌డీ చేస్తానని చెబుతుండడాన్ని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 1997లో ఐదు వేలు ఇస్తానని చెప్పిన బాబు ఎంతమందికి ఇచ్చారో ఆలోచించుకోవాలని కోరారు. బీసీలకు బాబు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేకపోయారన్నారు. మైనారిటీలకు ఎనిమిది శాతం రిజర్వేషను ఇస్తానని ఇప్పుడు చెబుతున్న బాబు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. దివంగత మహానేత అలాకాకుండా చెప్పింది చెప్పినట్లు అమలుచేసి చూపారన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరకీ ప్రయోజనం చేకూరడం లేదనీ, తమ పార్టీ అధికారంలోకి వస్తే  రాజశేఖరరెడ్డిగారు చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలనూ అమలుచేస్తామనీ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.

Back to Top