'విద్యుత్‌ సమస్యలపై వాయిదా తీర్మానం'

హైదరాబాద్, 13 మార్చి 2013: రాష్ట్ర ప్రజలను పీడిస్తున్న ‌విద్యుత్ సమస్యలపై గురువారంనాడు శాసనసభలో వాయిదా తీర్మానం ఇస్తున్నట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజలకు అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు. శాసనసభలో బలమైన ప్రతిపక్షంగా తాము వ్యవహరిస్తామన్నారు. బుధవారాత్రి జరిగిన పార్టీ శాసనసభా పక్షం సమావేశం ముగిసిన అనంతరం శోభా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

అసమర్థ, ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టాల్సిన టిడిపి నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని శోభా నాగిరెడ్డి విమర్శించారు. శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ఈ ఉదయం చేసిన ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేవని ఆమె వ్యాఖ్యానించారు.

కాగా, బషీర్‌బాగ్‌ కాల్పుల్లో మరణించిన వారికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం ఉదయం 8 గంటలకు బషీర్‌బాగ్‌లోని స్మారక స్థలం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం వారంతా విద్యుత్‌ కోతలకు నిరసనగా బషీర్‌బాగ్‌ నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్రగా వెళతారని ఆ ప్రకటనలో పేర్కొంది.
Back to Top