'విద్యుత్‌'పై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజాబ్యాలట్

హైదరాబాద్, 26 మార్చి 2013: విద్యుత్ సమస్యలపై ప్రజా బ్యాలట్‌ నిర్వహించాలని వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ బ్యాలట్‌ ద్వారా వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను తెసుకుని విశ్లేషించేందుకు సిద్ధమైంది. విద్యుత్‌ సమస్యపై సిఎం, డిప్యూటీ సిఎం, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలంతా పర్యటించి ప్రత్యక్షంగా క్షేత్ర పరిశీలన చేసి వాస్తవాలను ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేయాలని మంగళవారం ఉదయం ఒక నిర్ణయం తీసున్నారు. ఆ నిర్ణయం జరిగిన మరి కొద్దిసేపటికే విద్యుత్‌ సమస్యపై ప్రజా బ్యాలట్‌ నిర్వహించాలని మరో ప్రధాన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఒక పక్కన పరిశ్రమలు మూతపడుతున్నాయని, మరో పక్కన విద్యార్థుల ఇబ్బందులు చెప్పనలవే కాదని పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. విద్యుత్‌పై ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతోంది. 'ఇల్లు కాలిపోతుంటే బావి తవ్విస్తున్న చందం'గా ప్రభుత్వం తీరు ఉందని పార్టీ నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో సరైన కదలిక మాత్రం కానరాని పరిస్థితుల్లో విద్యుత్‌ సమస్యపై ప్రజా బ్యాలట్‌ నిర్వహించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వచ్చింది.

ఈ ప్రజా బ్యాలట్‌లో మూడు ప్రశ్నలను ప్రజల ముందుకు పార్టీ తీసుకువస్తున్నది.
అవి...
1) రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్‌ ఛార్జీల భారాన్ని మీరు సమర్థిస్తారా?.. సమర్థించరా?
2) విద్యుత్‌ సరఫరా ఏ విధంగా ఉంది?   బాగుంది...   బాగాలేదు.
3) రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా 9 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తోందా?... చేయడం లేదా?.
ఈ మూడు ప్రశ్నలతో ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలన్నది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం.

ముందుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ప్రజా బ్యాలట్‌ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. తరువాత జిల్లా కేంద్రాలు, అనంతరం మండల కేంద్రాలు, గ్రామాల్లో కూడా ప్రజా బ్యాలట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందన్నది ఈ బ్యాలట్‌ ద్వారా రాబట్టి విశ్లేషించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సమాయత్తం అవుతోంది.
Back to Top