'విద్యుత్‌'పై తక్షణమే అసెంబ్లీలో ప్రకటించాలి

హైదరాబాద్, 3 ఏప్రిల్‌ 2013: అసెంబ్లీని తక్షణమే సమావేశపరిచి విద్యుత్ సమస్యపై చర్చించాలని వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ డిమాండ్ చేశారు. విద్యు‌త్ ఛార్జీలను 4,‌ 5 తేదీల్లో సమీక్షిస్తామన్న ప్రభుత్వం వెంటనే అసెంబ్లీని సమావేశ పరిచి ప్రకటించాలని ఆమె అన్నారు. కరెంట్ ఛార్జీలు తగ్గించేవరకూ‌ తమ దీక్ష కొనసాగుతుందని శ్రీమతి విజయమ్మ బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

విద్యుత్ ఛార్జీల పెంపు‌నకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ‌, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ('కరెంట్‌ సత్యాగ్రహం') రెండవరోజు బుధవారం కొనసాగుతున్నది. విద్యుత్‌ సమస్యపై శాసనసభలో చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని శ్రీమతి విజయమ్మ ఎద్దేవా చేశారు. శాసనసభను తక్షణమే సమావేశపరిచి విద్యుత్ సమస్యపై చర్చించాలని‌ ఆమె డిమాండ్ చేశారు. ‌విద్యుత్‌ విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీరును హైకోర్టు కూడా తప్పు పట్టిన విషయాన్ని శ్రీమతి విజయమ్మ ఈ సందర్భంగా ప్రస్తావించారు.


Back to Top