సత్తెనపల్లి (గుంటూరు జిల్లా), 4 మార్చి 2013: అసాధారణ రీతిలో విద్యుత్ కోతలు విధించడమే కాకుండా, కరెంట్ చార్జీలు పెంచిన ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర పాలకులకు ముందుచూపు లేకపోవటం వల్లే మనకు తీవ్ర విద్యుత్ సమస్య తలెత్తిందని ఆరోపించారు. విద్యుత్ కోతల కారణంగా అన్నదాతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యను ఇంత తీవ్ర స్థాయికి తీసుకువచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై శ్రీమతి షర్మిల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ కోతలు, బిల్లుల పెంపునకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిచింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా సెంటర్ వద్ద జరిగిన ధర్నాలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, శ్రీమతి షర్మిల పాల్గొన్నారు. ఈ ధర్నాలో భారీ సంఖ్యంలో పాల్గొన్న అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు.
ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్న చంద్రబాబు తీరుపైన కూడా శ్రీమతి షర్మిల విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో రైతులు ఎంతగా కష్టాలు పడిందీ ఆమె కళ్ళకు కట్టినట్లు వివరించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, తన సోదరుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఏ తప్పూ చేయకపోయినా కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై, కుట్ర చేసి అన్యాయంగా జైలుకు పంపించాయని దుమ్మెత్తిపోశారు. తన భర్త అనిల్‌కుమార్ పుట్టింది సత్తెనపల్లిలోనే అని శ్రీమతి షర్మిల చెప్పారు. సత్తెనపల్లికి రావాలని చాలా కోరికగా ఉండేదని అన్నారు. ఆ కోరిక ఇప్పటికి ఇలా నెరవేరినందుకు సంతోషంగా ఉందని శ్రీమతి షర్మిల అన్నారు.
చార్జీలు, పన్నులు పెంచకుండానే అభివృద్ధి చేసిన మహానేత :దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళూ ఎలాంటి ఆటంకమూ లేకుండా విద్యుత్ సరఫరా చేసినవైనాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. అదృష్టం సరిగా లేక ఏ రైతుకైనా పంట నష్టం వస్తే ఆ మహానేత పరిహారం కూడా చెల్లించారని చెప్పారు. రైతులకు రూ. 13౦౦ కోట్లు విద్యుత్ బకాయిలు మాఫీ చేశారన్నారు. వారికి రూ. 12 వేల కోట్లు రుణ మాఫీ చేసిన ఘనత వైయస్‌ఆర్‌దే అన్నారు. డాక్టర్ వైయస్‌ఆర్ బ్రతికి ఉంటే ఇప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్ వచ్చి ఉండేదని అన్నారు. ఐదేళ్ళ పాలనలో వైయస్‌ఆర్ విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. మహిళల మీద ఆర్థిక భారం పడకూడదని ఆ మహానేత వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచలేదన్నారు.ద్యుత్, ఆర్టీసీ చార్జీలు, పన్నులు పెంచకుండానే అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిరాఘాటంగా అమలు చేసిన ఏకైక రికార్డు ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి అని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు.
గ్రామాల్లో 3 గంటలు కూడా ఉండని కరెంటు :డాక్టర్ వైయస్‌ఆర్ రెక్కల కష్టంతో రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తున్నదో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారని శ్రీమతి షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా 7 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడంలేదన్నారు. రాజశేఖరరెడ్డి వాగ్దానం చేసిన 9 గంటలు కాదు కదా కనీసం 3 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడంలేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పెంచేసిన విద్యుత్ బిల్లులు కట్టలేకపోయిన అన్నదాతల మోటార్లు, స్టార్టర్లను ఎత్తుకుపోతున్నదని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాల్లో 3 గంటలకు మించి కరెంటు ఉండడంలేదన్నారు. రెండు నుంచి 12 గంటలు విద్యుత్ కోత విధించినట్లు ముఖ్యమంత్రి కిరణ్ చెబుతున్నారని, ఆయన గ్రామాల్లోకి వెళ్ళి పలకరిస్తే 20 గంటల వరకూ కొత్త కోత అమలు చేస్తున్న విషయం ఆయనకు తెలుస్తుందన్నారు.
'ఈ ప్రభుత్వం ఉంటేనేం... చస్తేనేం..':మహానేత హయాంలో రూ 200 నుంచి రూ. 300 వరకూ ఉపాధి హామీ కూలీ డబ్బులు అందించేవారని, ప్రస్తుత ప్రభుత్వం రూ. 30 మాత్రమే ఇస్తోందని ఒక మహిళ చెప్పిందని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. తమకు ఉపాధి హామీ కూలీ డబ్బులు సరిగా ఇవ్వకపోతే తామెలా బతకాలంటూ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఓ మహిళ నిలదీసిన వైనాన్ని ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. ప్రజల కష్టాలు పట్టించుకోని ఈ ప్రభుత్వం ఉంటేనేం... చస్తేనేం... అంటూ ఆ మహిళ శాపనార్థాలు పెట్టిందని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రుల ఇళ్ళల్లో ఎంత సమయం విద్యుత్ కోత విధిస్తున్నారో చెప్పాలంటూ ఆ మహిళ నిలదీసిందన్నారు.
పరిశ్రమలు ఎలా నడవాలి? :ఇంతకు ముందెన్నడూ లేనంతగా మన రాష్ట్రం తీవ్రమైన కరెంటు సంక్షోభం ఎదుర్కొటున్నదని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 12 గంటల పాటు అధికారికంగా విద్యుత్ కోత విధిస్తే ఇక పరిశ్రమలు ఎలా నడుస్తాయని శ్రీమతి షర్మిల సూటిగా ప్రశ్నించారు. వేలకు వేలు పరిశ్రమలు మూతపడిపోతున్నాయని, లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇంత ఘోరమైన పరిపాలన, ఇంత భారీ స్థాయిలో విద్యుత్ సంక్షోభమూ మన రాష్ట్రంలో ఇంతకు ముందెన్నడూ లేన్నారు.
ఇంత ఘోరంగా పరిపాలన కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు పట్టలేదని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. ప్రజల బాగోగులూ ఆయనకు పట్టలేదన్నారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. వ్యవసాయం దండగ అని, ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందన్నారని, సబ్సిడీలిస్తే ప్రజలు సోమరిపోతులవుతారని చంద్రబాబు అవమానకరంగా మాట్లాడిన విషయాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. మహానేత వైయస్‌ఆర్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చాలంటే హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలని హేళన చేసిన వైనాన్ని గుర్తు చేశారు. రూ. 50 ఉన్న హార్సు పవర్ విద్యుత్‌కు రూ.625 కు పెంచేసిన ఘనుడు చంద్రబాబునాయుడు అని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నదాతలను అవమానించిన బాబు :చంద్రబాబు హయాంలో 1999లో పంటలు ఎండిపోతుంటే సాగర్ నీళ్ళు ఇవ్వండని రైతులు ఆయనను అడిగితే.. మీ పంటలు ఎండిపోతేపోనివ్వండి... పంటలు ఎండిపోతే మీకు తెలిసి వస్తుందని, నీళ్ళిచ్చేది లేదని, అసలు 'పంటలు ఎందుకు వేశారు?' అని అవమానించారన్నారు. 'మీకు ఇలాగే జరగాలి' అంటూ హేళన చేశారన్నారు. రైతులు పంటలు వేయడమే తప్పు అన్నట్లు ఆయన మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇలాగే ఉంటే, ఇలాగే ఆలోచిస్తే తాను ఇంకా తీవ్రంగా ఉంటానని బెదరించిన ఘనుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చంద్రబాబు పాదయాత్రలో చాలా డ్రామాలు చేస్తున్నారన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానని మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అన్నప్పుడు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని ఎగతాళిగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఆయన పథకాలను అమలు చేస్తానని, ఆయన హామీలను తాను కూడా నెరవేరుస్తానంటూ గ్రామాల్లో తిరుగుతున్నారని చంద్రబాబును శ్రీమతి షర్మిల తూర్పారపట్టారు. చంద్రబాబు తీరు పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.
విద్యార్థులకు లాఠీ దెబ్బలు :స్కాలర్‌షిప్పుల కోసం విద్యార్థులు చంద్రబాబును అర్థిస్తే వారికి ఇవ్వలేదు సరికదా కనీసం మెస్ చార్జీలు కూడా పెంచలేదని, పైపెచ్చు వారిని లాఠీలతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆస్పత్రిలో ఉచిత వైద్యానికి వెళ్ళే పేదవారి మీద కూడా యూజర్ చార్జీలు వసూలు చేసిన కఠినాత్ముడు చంద్రబాబు అని నిప్పులు చెరిగారు.
చంద్రబాబు పాదయాత్ర ప్రజల కోసం కాదు :రైతులపై చంద్రబాబుకు ప్రేమే ఉంటే.. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి రుణాలు మాఫీ కాదు కదా.. కనీసం రుణాల మీద వడ్డీనైనా ఎందుకు మాఫీ చేయలేదని శ్రీమతి షర్మిల నిలదీశారు. నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే... పులి పులే! అని ఆమె ఎద్దేవా చేశారు. 'మీ కోసం' అంటూ చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర ప్రజల కోసం కానేకాదన్నారు. ఎన్నికల రోజు తనను గుర్తుపెట్టుకోవాలని కోరేందుకే అన్నారు. ప్రజల కోసమే అయితే, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎప్పుడో అవిశ్వాసం పెట్టేవారని అన్నారు.
ప్రజల దృష్టిలో విలన్ :అవిశ్వాస తీర్మానం పెట్టమని చంద్రబాబును రోజూ తాము అడుగుతున్నామన్నారు. అవిశ్వాసం అనగానే చంద్రబాబుకు గుర్తు వచ్చేవి ప్రజల కష్టలు కాదని, ఈ ప్రభుత్వం వైఫల్యం కూడా కాదని.. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఎక్కడ వైయస్‌ఆర్‌సిపి లాభపడుతుందో అని చంద్రబాబు అవిశ్వాసం పెట్టకుండా కూర్చున్నారన్నారు. అవిశ్వాసం అంటే ఒక అసమర్థ ప్రభుత్వంపై పెట్టేది అని చంద్రబాబు అనుకోవడం లేదని అన్నారు. అవిశ్వాసం అంటే వైయస్‌ఆర్‌సిపిపై పెట్టేది అనుకుంటున్నారన్నారు. ఈ ప్రజా కంటక ప్రభుత్వాన్ని దించకుండా ఉంటే చంద్రబాబు ప్రజల దృష్టిలో ప్రతిపక్ష నాయకుడు కాదు 'ప్రతి నాయకుడు' (విలన్)గా చులకన అయిపోతారని శ్రీమతి షర్మిల హెచ్చరించారు.
తనకు అధికారం ఇస్తే ఆరు నెలల్లో అంతా గాడిలో పెట్టేస్తానంటూ చంద్రబాబు చెబుతుండడాన్ని శ్రీమతి షర్మిల తప్పు పట్టారు. 'పేనుకు పెత్తనం ఇస్తే అంతా గొరిగేసింద'న్న సామెతను ఆమె ప్రస్తావించారు. దురదృష్టవశాత్తూ చంద్రబాబునాయుడో, కాంగ్రెస్ పార్టీయో మళ్ళీ అధికారంలోకి వస్తే మన రాష్ట్ర ప్రజలకు అంతకన్నా శాపం మరొకటి ఉండనే ఉండదని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు.
సిబిఐ తీరు సరికాదు :కాంగ్రెస్ చేతిలో సిబిఐ కీలుబొమ్మ అని దాని మాజీ డైరెక్టర్ జోగిందర్ సింగే చెప్పారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. చంద్రబాబుపై ఉన్న అవినీతి ఆరోపణలున్నా సిబిఐ కేసులు పెట్టదని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని అత్యంత విలువైన భూములను ఎమ్మార్ సంస్థకు కారు చౌకగా అమ్మేసినా చంద్రబాబుపై సిబిఐ కన్ను పడదన్నారు. చిరంజీవి బంధువు ఇంటిలో 70 కోట్ల రూపాయలు దొరికినా సిబిఐ కంటికి కనిపించదన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మద్యం మాఫియా డాన్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబుతున్నా సిబిఐకి వినిపించదన్నారు.
ఏ పాపం చేయని జగనన్నను మాత్రం సిబిఐ ఆగమేఘాల మీద విచారిస్తుందని, అక్రమంగా జైలులో పెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న వస్తే తమ దుకాణాలు శాశ్వతంగా మూసేసుకోవాలనే కాంగ్రెస్, టిడిపిలు నీచమైన కుట్రలు పన్ని, అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలుకు పంపించాయని ఆరోపించారు. బోనులో ఉన్నా సింహం సింహమే అని, జగనన్న ధైర్యంగా ఉన్నారని, త్వరలోనే బయటకు వస్తారని, రాజన్న రాజ్యం స్థాపించే దిశగా మనందర్నీ నడిపిస్తారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. రాజన్న కన్న ప్రతి కలా జగనన్న నెరవేరుస్తారన్నారు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటా జగనన్న నిలబెడతారని చెప్పారు. ఆ రోజు వచ్చేంత వరకూ ప్రజలంతా జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరచాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు.
అంతకు ముందు శ్రీమతి షర్మిల సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు.