ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గం: అంబటి

గుంటూరు, 24 ఆగస్టు 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమరదీక్షను‌ పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేయడం, అమర్యాదకరంగా ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లిన తీరును కాంగ్రెస్‌ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యగా పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీక్షా శిబిరం వద్ద నేతలు, కార్యకర్తల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని నిప్పులు చెరిగారు. దీక్షా శిబిరంలో ఉన్న మహిళల పట్ల కూడా పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకొని పోలీసుల ద్వారా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నదన్నారు.

ప్రజల ఆదరణ మండుగా ఉన్న ఒక పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఆరు పదుల వయసుకు దగ్గరలో ఉండి ఐదు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఒక మహిళను ఆస్పత్రికి తరలించే తీరు ఇదేనా అని  అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం పట్ల ప్రభుత్వం కక్షకట్టి వ్యవహరిస్తున్నట్లుగా ఉందన్నారు.‌ కాగా, శ్రీమతి విజయమ్మ ఆరోగ్యం బాగా క్షీణించినట్లు వైద్యులు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఫ్లూయిడ్సు తీసుకోవడానికి కూడా శ్రీమతి విజయమ్మ నిరాకరిస్తున్నారని అంబటి చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top