వెంటనే అనర్హత వేటు వేయండి స్పీకర్

హైదరాబాద్, 18 ఏప్రిల్‌ 2013: పార్టీ విప్‌లు ధిక్కరించిన తమపై వెంటనే అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభిమాన ఎమ్మెల్యేలు విజ్ఞప్తిచేశారు. తమకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఉదయం వారు స్పీకర్‌ను కలిసి వివరణలు ఇచ్చారు. కాంగ్రెస్ రెబ‌ల్ ఎమ్మెల్యేలు పేర్ని ‌నాని, మద్దాల రాజేష్, గొట్టిపాటి రవికుమా‌ర్, బూచేపల్లి శివప్రసా‌ద్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జోగి రమేష్, ఆళ్ల నాని, టిడిపి ‌తిరుగుబాబు ఎమ్మెల్యేలు కొడాలి నాని, తానేటి వనిత తదితరులు గురువారం స్పీకర్‌ను కలిశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డితో పాటు వారంతా‌ స్పీకర్‌ను కలిసి లిఖిత పూర్వకంగా వివరణలు ఇచ్చారు.

అనంతరం వారు అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులందరికీ 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇస్తామని, పేదలందరికీ రూ.2 కే 30 కేజీల బియ్యం ఇస్తామని, 2014 వరకూ కూడా విద్యుత్‌ చార్జీలు పెంచబోమని 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ హామీలిచ్చి మరోసారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని గుర్తుచేశారు. అయితే, ఆ ఎన్నికలు జరిగి నాలుగేళ్ళు పూర్తయినా కూడా ఆ హామీలను అమలు చేయడంలేదని, ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిందని నాని దుయ్యబట్టారు. ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలకు భిన్నంగా ఇప్పటి మంత్రివర్గం వ్యవహరిస్తోందన్నారు. హామీలను తుంగలో తొక్కి, ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని విమర్శించారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది కనుకే తాను ప్రజల పక్షాన నిలబడి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినట్లు స్పీకర్‌కు ఇచ్చిన వివరణలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేనిఫెస్టోకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం విప్‌గా తాను ఏనాడూ తన బాధ్యతలను విస్మరించలేదన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపును నిలిపివేయాలని తాను సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డికి సూచించానన్నారు. అయితే, చార్జీలు పెంచకుండా ఉండాలంటే నోట్లు ముద్రించాలా? అన్నారని, తన మాటలను పెడచెవిన పెట్టారన్నారు. చట్ట ప్రకారం తాను రాజీనామా లేఖ ఇచ్చానని, స్పీకర్‌ ఎలాంటి చర్య తీసుకున్నా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నారన్నారు. తమపై అనర్హత ఓటు వేయమని, ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రధాన ప్రతిపక్షం పాత్రను టిడిపి విస్మరించిందని కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. అందుకే చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నేతగా తొలగించి, శ్రీమతి వైయస్‌ విజయమ్మకు ఆ అర్హత కల్పించమని తాను స్పీకర్‌ను కోరానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తనకు అసలు విప్‌ జారీ చేయలేదని నాని అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే తమకు విప్‌ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌స్‌కు వ్యతిరేకమన్న బాబు ఈ వ్యవహారంపై ప్రజలకు సమాధానం చెప్పాలని నాని డిమాండ్‌ చేశారు.

దమ్ముంటే, ధైర్యం ఉంటే తాము చేసిన రాజీనామాలను ఆమోదించాలని ఆ రోజే సవాల్‌ చేశామని చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిని పెట్టుకుని అయినా సరే తమ మీద పోటీ చేయాలని కాంగ్రెస్‌, టిడిపిలకు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ సవాల్‌ చేశారు. ఆ పార్టీలకు ఆ దమ్ముందా? ఆ ధైర్యం ఉందా? ఆ సత్తా ఉందా? అని అన్నారు. దొడ్డిదారిన కుమ్మక్కై, ఆరు నెలల పాటు పదవికి దూరం చేసినా తమ పట్ల ప్రజల్లో మరింత విశ్వసనీయత పెరుగుతుందన్నారు. ప్రజాసమస్యలను విస్మరించినందువల్లే తాను కాంగ్రెస్‌ పార్టీని విడిచిపెట్టానని బి. శివప్రసాదరెడ్డి తెలిపారు.
Back to Top