ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా..?

  • నదుల హారతి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న సీఎం
  • నదుల అనుసంధానంపై మాట్లాడే నైతిక అర్హత బాబుకు లేదు
  • కృష్ణానది ఆక్రమణలకు, ఎండిపోవడానికి ముఖ్యమంత్రే కారణం
  • ర్యాలీ ఫర్‌ రివర్‌ కార్యక్రమం హాస్యాస్పదం
  • సిగ్గులేకుండా ఇంటింటికీ ప్రచారంలో టీడీపీ నేతలు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌
విజయవాడ: మూడున్నరేళ్ల కాలంలో హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. నదులకు హారతి అని ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడలో ర్యాలీ ఫర్‌ రివర్‌ అని చంద్రబాబు కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నదులు, అనుసంధానం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. కృష్ణా నది ఒడ్డున ఇళ్లు కట్టుకొని నదిని అంచెలంచెలుగా అక్రమించుకుంటున్నాడని విమర్శించారు. నదులకు హారతులు అని ప్రజలను సాంప్రదాయాల పేరుతో మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 

ప్రణాళికలు పెంచడం తప్ప పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేదు
కృష్ణా నది అడుగంటడానికి కారణం చంద్రబాబు కాదా అని వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియా ముఖంగా ప్రశ్నించారు. మూడు పంటలు పండించే రైతు ప్రస్తుతం ఒక్క పంటతోనే సరిపెట్టుకోవడానికి కారణం చంద్రబాబే అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చు.. చంద్రబాబు మూడేళ్లలో పెట్టిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల ప్రణాళిక వ్యయం పెంచడం తప్ప వాటిని పూర్తి చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదన్నారు. ర్యాలీ ఫర్‌ రివర్‌ అని ఇషా ఫౌండేషన్‌  జగ్జీ వాసుదేవరావుతో కలిసి మీటింగ్‌ పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు ర్యాలీ ఫర్‌ హౌస్‌ అనే కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబును ఇంటికే పరిమితం చేస్తారని ఎద్దేవా చేశారు. ఇసుక నుంచి మట్టి వరకు దోచుకుంటున్న టీడీపీ పరిపాలన దుర్మార్గంగా ఉందన్నారు. నందుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని పునరుద్ఘాటించారు. 

ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా..?
ఇంటింటికీ కార్యక్రమంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ నేతలను అడుగడుగునా నిలదీస్తున్నా.. సిగ్గులేకుండా పోతున్నారని వెల్లంపల్లి విమర్శించారు. మూడున్నరేళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేశారని ఇంటింటికీ వెళ్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు టక్కుటమారాలు, జిమ్మిక్కులను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ప్రాజెక్టులపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చర్చకు సిద్ధంగా ఉందని, టీడీపీ నేతలకు దమ్ముందా అని సవాలు విసిరారు.
Back to Top