13న వైయస్సార్సీపీలోకి వెల్లంపల్లి

విజయవాడ(వన్‌టౌన్‌): రాష్ట్రంలో బీజేపీని తెలుగుదేశం పార్టీ శాసిస్తోందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. బీజేపీ నేతగా కొనసాగుతున్న వెల్లంపల్లి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 13న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైయస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రతిపక్షనేతగా జగన్‌ టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలపై అద్భుతమైన పోరాటాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఆయన నాయకత్వంలో తాను ముందుకు సాగుతానని చెప్పారు. 

రాష్ట్రంలో టీడీపీ అవినీతి పాలనపై స్పందిస్తే బీజేపీ అధిష్టానం వారిని సస్పెండ్‌ చేస్తోందని.. మరోవైపు ప్రధాని మోదీని టీడీపీ నేతలు బొండా ఉమా తుగ్లక్‌ అన్నా, నన్నపనేని రాజకుమారి, ముద్దుకృష్ణమనాయుడు, రాయపాటి వంటి నేతలు ఎంత దారుణంగా విమర్శించినా బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పందించటం లేదన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన జలీల్‌ఖాన్‌ను చంద్రబాబు అనైతికంగా పార్టీలోకి చేర్చుకున్నారన్నారు. జలీల్‌కు దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయాలన్నారు.

 

Back to Top