'వీడ్కోలును అపూర్వ ఘట్టంగా మార్చండి'

కొవ్వూరు (ప.గో.జిల్లా) :

శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో ఈ నెల 4న ముగియనున్న సందర్భంగా కొవ్వూరు - రాజమండ్రి రో‌డ్ కం రైలు వంతెనను జనసంద్రంగా మార్చాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ విధంగా శ్రీమతి షర్మిలకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఘనంగా వీడ్కోలు పలకాలని రీజనల్ కో-ఆర్డినేట‌ర్‌గా కూడా వ్యవహరిస్తున్న మైసూరారెడ్డి కోరారు. కొవ్వూరులోని యువరాజ్ ఫంక్ష‌న్ హా‌లులో శనివారంనాడు పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో శ్రీమతి షర్మిల యాత్రపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ.. రోడ్ కం రైలు వంతెనపై సాగే‌ శ్రీమతి షర్మిల పాదయాత్ర చరిత్రలో అపూర్వ ఘట్టంలా నిలిచిపోవాలని నాయకులను కోరారు.

ఈ నెల 4వ తేదీతో పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర ముగుస్తున్నందున నాయకులు, పార్టీ శ్రేణులు ఆమెకు వీడ్కోలు పలికేందుకు, తూర్పు గోదావరి జిల్లాలో అడుగిడుతున్న ఆమెకు స్వాగతం పలికేందుకు వేలాది మంది అభిమానులు పాదయాత్రలో భాగస్వాములయ్యేలా నాయకులు దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రధానంగా కొవ్వూరు నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో జనం తరలివచ్చేలా స్థానిక పార్టీ శ్రేణులు కృషి చేయాలని మైసూరారెడ్డి సూచించారు.

శ్రీమతి షర్మిల పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోందని, వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి ఈ యాత్రతో మరింత బలం చేకూరిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.

‌పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ.. శ్రీమతి షర్మిలకు వీడ్కోలు పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి సాయంత్రం 3 గంటలకు కొవ్వూరు రోడ్ కం రైలు వంతెన వద్దకు‌ చేరుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నాయకులు, మండల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, గ్రామ, వార్డు స్థాయిలో ఉన్న నాయకు‌లంతా వీడ్కోలు కార్యక్రమానికి హాజరు కావాలన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు, మాజీ ఎం.పి. చేగొండి హరిరామ జోగయ్య, ఎమ్మెల్యే తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యేలు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, నియోజకవర్గ సమన్వయకర్తలు చనుమోలు అశోక్‌గౌడ్, ‌పి.వి. రావు, తోట గోపి, కర్రా రాజారావు, తలారి వెంకట్రావు, కండిబోయిన శ్రీనివాస్‌తో పాటు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, కొవ్వూరు మండల, పట్టణ కన్వీనర్లు ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, మైపాల రాంబాబు, నాయకులు పరిమి హరిచర‌ణ్, ‌పి.కె. రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top