గుండె దడతోనే బాబు డిప్యూటీ సీఎంల ఎర

హైదరాబాద్:

కాపులు, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులను చంద్రబాబు నాయుడు ఎరగా వేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి దిగజారుడు రాజకీయానికి ఆయన పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు వ్యవహారం... ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ సినిమా తీరు గుర్తుకు వస్తోందన్నారు. ఆ సినిమాలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తక్కువైతే అందరికీ ఉప ముఖ్యమంత్రి పదవులిస్తానని ఆశ చూపి ఆరుగురిని ఎమ్మెల్యే ఏడుకొండలు తన వైపునకు లాక్కుంటారని, చివరిగా మరో ఎమ్మెల్యే వచ్చి తన వెంట మరొకతను కూడా ఉన్నారని, తనకూ ఉప ముఖ్యమంత్రే ఇస్తానంటే ఎలా అని ప్రశ్నిస్తే ‘నీకు ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాలే’ అని చెబుతారని ఇపుడు చంద్రబాబు చేస్తున్నదీ ఇలాగే ఉందని ఆమె ఎద్దేవా చేశారు.

వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ వెనుక కాపులు, ఇతర సామాజిక వర్గాలు ఉన్నాయని బెంబేలెత్తిన చంద్రబాబు నాలుగు ఓట్లు పొందాలనే ఎత్తుగడతో ఉప ముఖ్యమంత్రి పదవులిస్తామని ఆశపెడుతున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబుకు వారిపై నిజంగా ప్రేమ ఉంటే కాపుల ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో ఆ వర్గానికి ఎక్కువ సీట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ముందు ప్రకటించినట్లు బీసీలకు టికెట్లు ఎందుకు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో ఎటూ అధికారం దక్కదు కాబట్టి బీసీలకు సీఎం పదవి ఇస్తానని, రెండంకెల్లో కూడా సీట్లు వచ్చే అవకాశం లేని సీమాంధ్రలో ఉప ముఖ్యమంత్రి పదవులను ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారని ఆమె అన్నారు. రాజ్యాంగంలో లేని ఉప ముఖ్యమంత్రి పదవులను ఆయా వర్గాలకు ఇస్తానని ఎన్నికల ముందు చెప్పడం ప్రజలను మోసగించడమే అన్నారు.

Back to Top