పత్రికలపై చంద్రబాబు అక్కసు

హైదరాబాద్ :వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ  సాక్షి పత్రిక, చానెల్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జర్నలిజాన్ని పెయిడ్ జర్నలిజంగా దిగజార్చి చంద్రబాబు మీడియాను భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. దమ్ముంటే ఈవిషయంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.  జర్నలిజంలో విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని  వాసిరెడ్డి పద్మ ఘాటుగా విమర్శించారు.  

సాక్షి టీవీని చూడొద్దు, సాక్షి పత్రిక చదవొద్దు అనే స్థాయికి  సీఎం దిగజారారంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎంతగా చెడిపోయిందో అర్థం అవుతోందన్నారు. పాకిస్తాన్‌లో మాదిరిగా ఒక పత్రిక చదవొద్దు, ఒక చానెల్ చూడొద్దు అని ఫత్వా జారీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, ఇసుక మాఫియా పై ఒక్క సాక్షిలోనే కాదని, ‘ఈనాడు’లో కూడా ‘ఇసుకాసురులు’ అనే కథనాలు వచ్చాయన్నారు. డ్వాక్రా మహిళలను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా అక్రమాలకు పాల్పడుతున్నదీ మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు.

హైకోర్టు కూడా చివాట్లు పెట్టిందని ఆమె గుర్తు చేశారు. తమ అధినేత జగన్ ప్రతి వారం కోర్టు చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబు చెప్పడాన్ని పద్మ ప్రస్తావిస్తూ ‘అందుకు కారణం ఎవరు? మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి చేసిన కుట్ర ఫలితంగానే కదా జగన్‌పై కేసులు వచ్చింది?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  శ్వేత పత్రాల విడుదల పేరుతో అన్నీ అబద్ధాలే చెబుతున్నారన్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే తన ఆస్తులు, భార్య, కొడుకు, కోడలి ఆస్తులు హెరిటేజ్ వ్యవహారాలపైన విచారణకు సిద్ధం కావాలన్నారు.
Back to Top