విజన్ 20:20 కాదు డివిజన్ 420

హైదరాబాద్ 10 ఆగస్టు 2013:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధానికి లేఖ రాయడం ఓ డ్రామా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వస్తుందని తెలిసినప్పటికీ కిక్కురుమనకుండా ప్రకటన వెలువడిన అనంతరం దీనిని తాను స్వాగతించినట్లు చెప్పిన చంద్రబాబు నిన్న ప్రధానికి లేఖ రాయడంలోని ఔచిత్యాన్ని ఆమె ప్రశ్నించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పద్మ ప్రసంగించారు. సీమాంధ్రలో వెల్లువెత్తిన ఉద్యమానికి భయపడిన చంద్రబాబు తన పాత వ్యవహారశైలిని మరిచిపోయినట్టుందన్నారు. 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకీ ఇచ్చిన లేఖను ఇచ్చిన దగ్గర్నుంచి, కేంద్రాన్ని వెంటపడి తరిమి తెలంగాణ తెచ్చిన ఘనతను సొంత చేసుకోవాలనుకున్న విషయాన్ని ప్రజలెవరూ మరువలేదన్నారు. సీమాంధ్ర ప్రజలకు భయపడి చంద్రబాబు ఆ లేఖ రాశారన్నారు. రంగులు మార్చడంలో చంద్రబాబు ఊసరవెల్లిని మించిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు విజన్ ట్వంటీ-20 కాదు... డివిజన్ 420 అని ఆమె అభివర్ణించారు. సీమాంధ్ర ప్రజలకు బాబు ఓ విరోధిలా మారిపోయారని ఆమె పేర్కొన్నారు.

సీడబ్ల్యూసీ ప్రకటన కంటే ముందే చంద్రబాబుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటవుతుందన్న విషయం తెలుసని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఓ విధంగా వెన్నుపోటు పోడిచారన్నారు. తెలంగాణపై క్రెడిట్ పొందటంలో భాగంగానే చంద్రబాబు  పలుమార్లు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారని పద్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీట్లు, ఓట్ల కోసమే ప్రణబ్ కమిటీకి గతంలో బాబు తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చారన్నారు. ఆ లేఖను ఆమె ఓ బ్లాంక్ చెక్కుగా ఆభివర్ణించారు.
ఇప్పుడు తెలంగాణ విభజన ప్రకటనపై సీమాంధ్ర ప్రజలు దిగ్భ్రాంతి చెందుతున్నారనీ, తాను ఆవేదనకు గురవుతున్నాననీ బాబు ప్రధానికి లేఖ రాయడంలోని ఔచిత్యాన్ని ఆమె ప్రశ్నించారు. రోజుకో మాట, పూటకో వైఖరి మార్చిన విషయం మరిచిపోయారా అని ఆయనను నిలదీశారు. 2009లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని, మహాకూటమిని ఏర్పాటుచేసిన అంశాన్ని ఆమె గుర్తుచేశారు. 2009 డిసెంబరు9న చిదంబరం తెలంగాణ ప్రకటన చేసినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలందరితో రాజీనామాలు చేయించారన్నారు. తెలంగాణలో సీట్లు రాబట్టుకోవాలని 2012డిసెంబరులో ప్రధానికి లేఖ రాసి అఖిల పక్షం ఏర్పాటుచేయమని డిమాండు చేశారు. ఇన్ని సందర్భాలలో గుర్తురాని ప్రజలు ఇప్పుడే గుర్తొచ్చారా అని తీవ్రంగా అడిగారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరేమిటని అడగలేదు.. అన్ని ప్రాంతాలకూ సమస్యలు పరిష్కారం కావాలనీ అభిలషించలేదన్నారు.

మొదటినుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్న అంశాలనే చంద్రబాబు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారని వాసిరెడ్డి పద్మ చెప్పారు. సీఎం కిరణ్ కుమార్ కూడా అదే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిగారు చెప్పిన విషయాల్నే టీడీపీ నేతలు పేర్కొంటున్నారని ఆమె వివరించారు. షిండేతో సమావేశానికి ముందే కాంగ్రెస్ పార్టీ వైఖరిని వెల్లడించాలని మా పార్టీ కోరిందన్నారు. అన్ని ప్రాంతాల సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని తమ పార్టీ సూచించిందన్నారు. సీడబ్ల్యూసీ ప్రకటనకు ముందే పరిణామాన్ని ఊహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు షిండేకు ఓ లేఖ రాశారన్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రతిపాదనను అన్ని పార్టీల ముందు పెట్టాలని ఆ లేఖలో కోరారని తెలిపారు. దాన్ని చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోవాలన్న సూచననూ పెడచెవిన పెట్టారని వాసిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సూచన చేయాలని చంద్రబాబు గారికి కానీ, రాష్ట్ర మంత్రులకు గానీ లేకపోయిందని మండిపడ్డారు. ఓట్లు, సీట్లు గురించి కాకుండా మేము ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడామని ఆమె గుర్తుచేశారు. ఈ విషయాలను ఆరోజున చంద్రబాబు మాట్లాడలేదన్నారు. ఉద్యోగులు నిన్న కాక మొన్న ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు కూడా చంద్రబాబు నేను మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేసిన అంశాన్ని వాసిరెడ్డి ప్రస్తావించారు. సీమాంధ్ర ద్రోహిగా చంద్రబాబు వ్యవహరించారని ఆరోపించారు. తనకేమీ తెలియనట్లుగా ఇప్పుడు సీమాంధ్ర మనోవ్యథ చెందుతోందని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.  తెలంగాణకు అన్యాయం చేయమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఎప్పుడూ అడగలేదని స్పష్టంచేశారు. అన్ని ప్రాంతాలకూ ఎలా న్యాయం చేస్తారో చెప్పమన్నామన్నారు. అలా చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు.
కేంద్రమంత్రి కావూరి కూడా సీడబ్ల్యూసీ నిర్ణయానికి  తాను కట్టుబడి ఉంటానని చెప్పారనీ, ఇప్పుడు చెబుతున్న సమన్యాయాన్ని అంతకుముందే వినిపించి ఉండవచ్చు కదా అని ఆమె ప్రశ్నించారు.

తాజా ఫోటోలు

Back to Top