ఖాళీ స్థలం కనిపిస్తే గద్దల్లా వాలుతున్నారు

స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని వదలని టీడీపీ నేతలు
విజయవాడలో పెరిగిపోతున్న బోండా ఉమా ఆగడాలు
సమరయోధుడి భూమిని కాజేసి నకిలీ పత్రాలు సృష్టించిన బోండా
భూకబ్జాల్లో చంద్రబాబుకు వాటా ఉంది
అందుకే ఎన్ని స్కాంలు చేసినా నోరు మెదపడం లేదు
భూకబ్జాలపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి
హైదరాబాద్‌: ఎక్కడ భూమి కనిపించిన టీడీపీ నేతలు గద్దల్లా వాలిపోయి భూకబ్జాలకు పాల్పడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. రైతులు, సామాన్యుల భూములను దౌర్జన్యంగా లాక్కున్న చంద్రబాబు సర్కార్‌ చివరకు స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని కూడా వదల్లేదని మండిపడ్డారు. విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా స్వాతంత్య్ర సమరయోధుడి వారసులకు తెలియకుండా ఆ భూమిని తన భార్య సుజాత, అచరుల పేరుతో కొన్నట్లుగా తప్పుడు పత్రాలను సృష్టించాడని స్పష్టం చేశారు. చంద్రబాబు సర్కార్‌ భూ బాగోతాలపై వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయవాడలో ప్రభుత్వ, స్వాతంత్య్ర సమరయోధుల, వివాద భూములు కనిపిస్తే చాలు టీడీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో కేన్సర్‌ వ్యాధితో బాధపడుతూ చనిపోయే ముందు చిన్నారి సాయిశ్రీ తన ఇళ్లు తనకు అప్పగించాలని వేడుడున్న సంఘటనలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. 

విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా భూకబ్జాల వెనుక చంద్రబాబు హస్తం, భాగస్వామ్యం ఉందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. రాజధాని నగరంలో బోండా ఉమా లాంటి నాయకుడు చెలరేగిపోతున్నా చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కబ్జాల్లో సీఎంకు వాటా ఉన్నందువల్లే చర్యలు తీసుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో భూకబ్జా అంటే పెద్ద నేరంగా ఉండేదని, కానీ చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో కబ్జాలు ఫ్యాషన్‌గా మారాయన్నారు. ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా చంద్రబాబు ఆయన కొడుకు కబ్జాలకు పాల్పడుతుంటే మిగిలిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మసీలు ఊరుకనే ఉంటారా అని విరుచుకుపడ్డారు. 
  
చంద్రబాబే కృష్ణానది ఒడ్డున కబ్జా చేసి నిర్మించిన ఇంట్లో ఉంటున్నారని వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు. రాజధానికి సంబంధించిన భూముల విషయంలో రైతుల నుంచి పంట పొలాలను లాక్కొని వారికి స్థలాలు చూపించకుండా చంద్రబాబు ఆయన కోటరీకి, భాగస్వామ్యం ఉన్న కంపెనీలకు భూములు కేటాయించి చంద్రబాబు కబ్జాల రాయుడిగా అవతారం ఎత్తారన్నారు. కబ్జాల కోసమే చంద్రబాబు కేబినెట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో సైబరాబాద్‌ ఎలా స్కాం జరిగి సుజనా చౌదరి, మురళీమోహన్, సీఎం రమేష్‌లకు ఏ విధంగా అప్పగించారో.. అదే తరహాలో రాజధాని ప్రాంతంలో కూడా వందల ఎకరాలు టీడీపీ నేతలకు అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

విశాఖపట్నంలో లక్ష ఎకరాల భూకబ్జాకు మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్పడ్డారని మరో మంత్రి ఆరోపిస్తే బుద్ధున్న సీఎం సీబీఐ ఎంక్వైరీ వేయాలని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. భూస్కాంలో వాస్తవాలను బయటకు రానివ్వకుండా సీట్‌ను ఏర్పాటు చేసి చంద్రబాబు భూస్థాపితం చేశాడన్నారు. ఒక సామాన్యుడు ఇల్లు, స్థలం కొనాలంటే విజయవాడ పేరు చెప్పగాలనే భయపడిపోతున్నారన్నారు. అది ఎమ్మెల్యే బోండా ఉమాను చూస్తే వచ్చే భయం కాదని, కబ్జాల వెనుక చంద్రబాబు ఉన్నారనే భయం సామాన్యుడికి కలుగుతుందన్నారు. భూకబ్జాలపై చంద్రబాబు మొద్దు నిద్రపోతున్నట్లుగా వ్యవహరించడం దేనికి సంకేతం అని నిలదీశారు. ఆంధ్రరాష్ట్రంలో నాలుగేళ్లుగా జరుగుతున్న భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. 
 
Back to Top