మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

సీఎం నియోజకవర్గంలో మహిళలపై దాడి
వివస్త్రను చేసి వీడియోలు తీసిన టీడీపీ నేతలు
వాటిని సోషల్‌మీడియాలో పెట్టి పైశాచిక ఆనందం
ఘటన జరిగి 24 గంటలైనా స్పందించని చంద్రబాబు
ఆయనొస్తేనే బాగుంటుందని ప్రచారం ఇందుకేనా?
రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై దాడులు పెరుగుతున్నాయి
చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందించరా?
కనీసం కేసులు కూడా పెట్టనివారు మీరు పోలీసులా?
చంద్రబాబు అధికార అహం దించేందుకు మహిళా లోకం ఒక్కటవ్వాలి
హైదరాబాద్‌: చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను అత్యంత అమానుషంగా వివస్త్రను చేసి టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని, ఆ ఘటనను వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టి పచ్చనేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. చంద్రబాబు మహిళలకు కల్పించే రక్షణ ఇదేనా..? కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గంజర్లపల్లిలో జరిగిన ఘటనకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులైన ఇద్దరు దంపతులపై పక్కన ఉన్న మహిళ దుర్భాషలాడడం, తరువాత వారిపై దాడి చేయడం వెనుక టీడీపీ ప్రోద్భలం ఉందని క్లీయర్‌గా తెలుస్తుందన్నారు. మహిళను వివస్త్రను చేసి, రాళ్లతో కొట్టి, నోటితో కొరికి ఇంత దారుణం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్‌లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని విన్నాం.. కానీ ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి దుర్ఘటన జరగడం సిగ్గుచేటన్నారు. 

విశాఖ జిల్లా పెందుర్తిలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అనుచరులు భూకబ్జాలకు ఎదురెళ్లిన దళిత మహిళలను వివస్త్రను చేశారని, అదే విధంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో జల్లిపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవులు అనుచరులు సుదమ్మ అనే మహిళలను చెప్పుకాలితో ఎగిరి ఎగిరి తంతే ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఇంత దారుణం జరిగితే ఏమీ ఎరుగనట్లు చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నాడని మండిపడ్డారు. బాబు కుటుంబం సభ్యులు రక్తదానాలు గురించి సూక్తులు చెబుతున్నారని, మీ కుప్పం నియోజకవర్గంలో జరిగిన సంఘటనపై మీకు చీమ కుట్టినట్లుగా కూడా లేదా.. అని చంద్రబాబు కుటుంబ సభ్యులను వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. టీడీపీకి గిట్టనవారిని ఏమైనా చేయొచ్చు అనే సంకేతాన్ని చంద్రబాబే ఇస్తున్నారన్నారు.
మొట్టమొదటి సారిగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మా వాళ్లను చూసీచూడనట్లుగా వదిలేయాలని చంద్రబాబే చెప్పారని, చంద్రబాబు చర్యలతోనే రాష్ట్రంలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ఎమ్మార్వోను ఇసుకలో వేసి కొట్టినా కేసులు ఉండవు. మీ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఐపీఎస్‌ను దుర్భాషలాడినా చర్యలుండవు. పైగా చంద్రబాబే దగ్గరుండి రాజీ చేయించారని గుర్తు చేశారు. రిషితేశ్వరి మృతిపై ఎందుకు సరైన చర్యలు తీసుకోలేదు. అప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా..అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

ఆయన వస్తేనే మహిళలకు రక్షణ అని ప్రచారం చేయించిన చంద్రబాబు వస్తే ఇంత దారుణఃగా ఉంటుందని అనుకోలేదని మహిళలు గగ్గోలు పెడుతున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. నూలుపోగు లేకుండా ఒక మహిళను నిలబెడితే చర్యలు తీసుకోని చంద్రబాబు చొక్కా పట్టుకోరా ఎవరైనా.. అని ప్రశ్నించారు. మీ ఇళ్లలో మగాళ్లకు తోలు మందమై పరిపాలన చేస్తున్నారని, పారిశ్రామిక వేత్తల సదస్సు గురించి మాట్లాడుతున్న నారా భువనేశ్వరి, బ్రహ్మణి.. కుప్పంలో ఇంత దారుణమైన సంఘటన జరిగితే మీరు బయటకు వచ్చి మాట్లాడరా..అని నిలదీశారు. ‘‘చిత్తూరు కలెక్టర్, ఎస్పీ భార్యలను అడుగుతున్నా.. మీ ఇళ్లలో మగవారు మానవత్వం మరిచిపోయారేమో.. మీకేమైంది.. రాష్ట్ర డీజీపీ భార్యను అడుగుతున్నా.. ఇంత దారుణాలు జరుగుతున్నా.. కేసులు పెట్టకపోతే.. ఇళ్లలో మీ భర్తను ప్రశ్నించరా..’’ కనీసం కేసు పెట్టడానికి భయపడుతున్న మీరు పోలీసులేనా..అని విరుచుకుపడ్డారు. 
 
మనిషికి రక్షణ కల్పించాల్సిన ఐఏఎస్, ఐపీఎస్‌లు పచ్చచొక్కాలు వేసుకొని గంగిరెద్దుల్లా తలలు ఊపుతున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. కుప్పంలో ఒక మహిళలను వివస్త్రను చేసి 24 గంటలు అయినా కేసు పెట్టరా.. రాక్షస పాలన అనేందుకు ఇది నిదర్శనం కాదా.. అని మండిపడ్డారు. పదవులు ఎందుకు అలంకరించుకునేందుకా అని నిలదీశారు. మంత్రి అచ్చెన్నాయుడు ఐఏఎస్‌ అధికారిణిని లైగింక వేధింపులకు గురిచేస్తున్నారంటే దిక్కులేదు.. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ కూతురు మంత్రి బంధువులు దాడి చేస్తున్నారని రోడ్డుపై బైఠాయిస్తే రాజీలు చేశారు. ఇదేనా చంద్రబాబు పరిపాలన అని ప్రశ్నించారు. ప్రజల కంటే నేను గొప్పవాడిని, ప్రజాస్వామ్యం కంటే నేను గొప్పవాడిని అనుకుంటున్నాడని, మహిళలపై ముఖ్యమంత్రి చేసే నీతి వ్యాఖ్యలు మేకవన్నెపులి లాంటిదని అర్థం అవుతుందన్నారు. కుంజర్లపల్లిలో జరిగిన ఘటనపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని, కుప్పం, రాష్ట్ర మహిళలకు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా చంద్రబాబు తలకెక్కిన అహంను దించాలని మహిళలకు పిలుపునిచ్చారు. 
 
Back to Top