నిప్పులు చిమ్ముతూ నడిచిన వైయస్ఆర్‌సీపీ

ఇడుపులపాయ (వైయస్ఆర్‌ జిల్లా) :

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తొలి నుంచీ చిత్తశుద్ధితో ఉద్యమించింది ఒకే ఒక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వైపు కేంద్రం అడుగులు వేస్తోందన్న సంకేతాలు అందిన మరుక్షణమే 2013 జూలై 17న వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు లేఖ రాసిన వైనాన్ని ఆమె గుర్తుచేశారు. ఆ తరువాత 16 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామా చేశారని చెప్పారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ కూడా రాజీనామా చేశారని తెలిపారు. ఇడుపులపాయలో ఆదివారం జరిగిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ రెండవ ప్లీనరీ 'ప్రజా ప్రస్థానం' వేదికపై ఆమె పార్లీ నివేదిక సమర్పించారు.

ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్, హోంమంత్రి షిండే, ప్రతిపక్షాలకు శ్రీమతి విజయమ్మ లేఖలు రాశారని అన్నారు. గుంటూరులో శ్రీమతి విజయమ్మ ఆమరణ నిరహార దీక్ష చేశారని, 2013 ఆగస్టు 25న శ్రీ వైయస్ జగ‌న్ జైలులో‌నే నిరాహార దీక్ష చేశారన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ శ్రీ జగన్‌ సోదరి శ్రీమతి షర్మిల సమైక్య శంఖారావం యాత్ర చేశారని చెప్పారు. అక్టోబరు 4న విభజన నిర్ణయానికి నిరసనగా ‌వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 72 గంటల బంద్ నిర్వహించిన వైనాన్ని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. అక్టోబరు 5న శ్రీ వైయస్ జగ‌న్ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు.
అనంతరం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో లక్షలాది మందితో 'సమైక్య శంఖారావం' సభ జయప్రదంగా నిర్వహించారని పద్మ తెలిపారు. నవంబర్ 16 నుంచి‌ శ్రీ జగన్ వివిధ పార్టీల‌ జాతీయ నాయకులను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కోరారని గుర్తుచేశారు. ఈ ఏడాది జనవరిలో కూడా విభజన బిల్లుకు నిరసనగా అసెంబ్లీలో, వెలుపల వైయస్ఆర్‌సీపీ అలుపెరుగని పోరాటం చేసిందన్నారు. ఆ పోరాటం ఫలితంగానే జనవరి 30న శాసనసభ మూజువాణి ఓటుతో విభజన బిల్లును తిరస్కరిస్తూ తీర్మానించిందని పేర్కొన్నారు.

ఈ మూడేళ్ళలో వైయస్ఆర్‌సీపీ ప్రతి కార్యకర్త, నాయకుడు నిప్పుల కుంపటి మీద నడిచారని పద్మ అన్నారు. ఈ మూడేళ్ళూ నిప్పులు చిమ్ముకుంటూ నడిచారన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రలు, కుతంత్రాలు, నీచ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచారని అభివర్ణించారు. ఈ పోరాటంలో అలిసిపోయినా, విసిగిపోయినా మాత్రం రగిలిపోవడం ఆగలేదని ప్రశంసించారు. శ్రీ జగన్, శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల నేతృత్వంలో కార్యకర్తలంతా కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ వైయస్ఆర్‌సీపీ అని పేర్కొన్నారు. మహానేత వైయస్ఆర్‌ నాటి ప్రజా హిత పరిపాలన కోసం పది కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.

Back to Top