ఆధారాలు చూపించి మాట్లాడు


– జగన్‌ సవాల్‌ను స్వీకరించలేక తోకముడిచావ్‌ 
– తప్పుడు కథనాలతో అసత్య ప్రచారం మానుకో
– ఏనాడైనా ఈడీ టాప్‌ టెన్‌ లిస్టు బయట పెట్టిందా
– పెయిడ్‌ కథనాలతో జగన్‌ పాదయాత్రను ఆపాలని కుట్ర  

పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం చూసి చంద్రబాబు మరో మురికి ఆలోచనకు తెర తీశారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆధారాల్లేని అసత్య కథనాలతో వైయస్‌ జగన్‌ కీర్తిని మసకబార్చాలని ప్రయత్నిస్తున్నారని.. ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు సాధించలేరని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంగ్లిషు పత్రిక కథనాన్ని ఆధారంగా పచ్చ పత్రికలు 
వార్తలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఈడీ ఏనాడూ అధికారికంగా లిస్టును ప్రకటించకుండా తప్పుడు కథనం బ్యానర్‌గా ముంద్రించడంపై మండిపడ్డారు. దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాల్‌ విసిరారు. ఈడీ, సీబీఐల పేరు చెప్పి జగన్‌ను అరెస్టు చేస్తారని బూచి చూపించి తమ పార్టీ నుంచి ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్న నాయకులను చంద్రబాబు కాపాడుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు.

నంద్యాల ఎన్నికలప్పుడూ ఇంతే..
పెయిడ్‌ జర్నలిస్టులతో పెయిడ్‌ వార్తలు రాయించి కట్టుకథలు అల్లడం చంద్రబాబుకు అలవాటేనని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. నంద్యాల ఎన్నికల సమయంలోనూ జగన్‌ బీజేపీతో కలవబోతున్నారని ఒక టీవీలో తప్పుడు కథనం ప్రసారం చేయించారని.. కానీ ఆ తర్వాత ఆయనే బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారని పేర్కొన్నారు. శుక్రవారం వైయస్‌ జగన్‌ కోర్టుకు హాజరవుతారని తెలిసి ఒక రోజు ముందుగా ఇంగ్లిషు పత్రికలో వార్త రాయించి.. దాన్ని ఆధారంగా అంటూ ఈరోజు అనుకూల తెలుగు పత్రికల్లో బ్యానర్‌ వార్తలు రాయించుకున్నాడని అన్నారు. చంద్రబాబు మురికి ఆలోచనలతో జగన్‌పై బురద చల్లాలనే కుట్రలు మానుకుని అధికారంలో ఉండే ఏడాదైనా ప్రజలకు మేలు చేయాలని హితవు పలికారు. 

ప్రజలడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి 
మా పార్టీ నాయకుడు ఏదైనా కార్యక్రమం చేపట్టడానికి ఆలస్యం ప్యారడైజ్, పనామా అని ఆధారాల్లేని కథనాలతో వార్తలు రాయించడం బాబుకు అలవాటైందని.. ఆధారాలు బయటపెట్టాలని సవాల్‌ విసిరితే తోక ముడిచారని ఎద్దేవా చేశారు. జగన్‌ పాదయాత్రకు జనం వేలాదిగా వచ్చి సమస్యలు చెప్పకుంటున్నారని బహిరంగ సభల్లో మీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని చెప్పారు. దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సిగ్గు విడిచి కథనాలు రాయించడం తప్ప వాటికి ఫాలోఅప్‌లు ఉండవని చెప్పారు. పాదయాత్రలో జగన్‌ చేసిన సవాల్‌ను స్వీకరించే ధైర్యం లేని మీరు వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడం తప్ప ప్రజలక మేలు చేయలేరని పేర్కొన్నారు. మీ నాలుగేళ్ల పాలనతో జనం విసుగెత్తిపోయారని.. అందుకే వారి సమస్యలు చెప్పకునేందుకు జగన్‌ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. 
Back to Top