నేరాలకు రాజధానిగా మార్చాడు

టీడీపీ నేతల సెక్స్ దందా..కాల్ మనీ పేరుతో మహిళలకు గాలం
అధిక వడ్డీలకు అప్పులిచ్చి బ్లాక్ మెయిల్ ..బలవంతంగా వ్యభిచారం 
చంద్రబాబు అండదండలతోనే తమ్ముళ్ల నేరాలు..వాసిరెడ్డి పద్మ ఫైర్
దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

హైదరాబాద్ః ఎంతో చరిత్ర ఉన్న విజయవాడను చంద్రబాబు నేరాలకు రాజధానిగా మార్చాడని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఇసుక మాఫియా, కల్తీమద్యం, కల్తీ నెయ్యి, దొంగనోట్ల పంపిణీ ముఠా, సెక్స్ రాకెట్ కు విజయవాడను రాజధానిగా చేశారని నిప్పులు చెరిగారు. కాల్ మనీ పేరుతో పేద, మధ్య తరగతి మహిళల్ని లోబర్చుకొని లైంగికంగా వేధిస్తున్న పరిస్థితికి టీడీపీ నేతలు దిగజారడం సిగ్గుచేటని పద్మ ధ్వజమెత్తారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు వలవేసి టీడీపీ నేతలు సెక్స్ రొంపిలోకి దింపడం అమానుషమన్నారు. సంవత్సరకాలంగా ముఖ్యమంత్రి విజయవాడలో ఉంటూ నగరాన్ని నేరాలమయం చేశారని విరుచుకుపడ్డారు.

అధిక వడ్డీలకు అప్పులిచ్చి అవి చెల్లించలేని పరిస్థితుల్లో మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తూ టీడీపీ నేతలు లొంగదీసుకుంటున్నారు. బ్లాక్ మెయిల్ చేసి వారిద్వారా మరికొందరిని వ్యభిచారంలోకి దింపి సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. ముఖ్యమంత్రి నివాసమున్న నగరం నడిబొడ్డున ఇలాంటి దారుణాలు జరగడం సిగ్గుచేటని వాసిరెడ్డి పద్మ ఫైరయ్యారు. చంద్రబాబు అండదండలతో ఎవరు ఏం చేస్తారులే అన్న ధైర్యంతోనే తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నేతలు బరితెగిస్తున్నారని పద్మ విమర్శించారు.

సెక్స్ రాకెట్  గురించి చంద్రబాబు, పోలీసులకు అన్నీ తెలిసి కూడా టీడీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని పద్మ ఆరోపించారు. ఏంజరిగినా ముఖ్యమంత్రి చూసుకుంటాడన్న అహంకారంతో టీడీపీ నేతలు నేరాలకు పాల్పడుతున్నారన్నారు.  చేసిన తప్పులను, నేరాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు బుర్ర ఉపయోగిస్తారు తప్ప...ఎక్కడ కూడా నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు చొరవ తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. రౌడీల్లాగ మాట్లాడే ఎమ్మెల్యేలను మెచ్చుకుంటూ చంద్రబాబు వారిని ప్రజలు,  ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ఇదే సెక్స్ దందా వేరొక రాష్ట్రంలో జరిగి ఉంటే అల్ల కల్లోలం అయి ఉండేదన్నారు.  

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  మహిళా అధికారిని కొట్టిన రోజు, అంగన్ వాడీలను దూషించిన రోజే ... చంద్రబాబు అతన్ని శిక్షించి ఉంటే ఈరోజు ఈపరిస్థితి వచ్చేది కాదని పద్మ అన్నారు. సెక్స్ రాకెట్ లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు వారిని తప్పించాలంటూ పోలీసులపై ఒత్తళ్లు తీసుకురావడం దారుణమన్నారు. తప్పించే ప్రయత్నాన్ని వైఎస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు.  ఉన్నతస్థాయి అధికారులతో దర్యాప్తు జరిపించి దోషులు ఎంతటివారైనా  కఠినంగా శిక్షించాలని పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Back to Top