చంద్రబాబుకి పోయేకాలం దాపురించింది

కంకిపాడు: వ్యవసాయం దండగ అని మరో మారు వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు పోయేకాలం దాపురించిందని వైయస్సార్‌సీపీ జిల్లా సహాయ కార్యదర్శి మాదు వసంతరావు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ, వ్యవసాయాధారిత ప్రాంతాలు దేశంలో ఎక్కువగా ఉన్నాయన్నారు. వ్యవసాయం కాకుండా ఇతర రంగాలను ఎంచుకోవాలని సేవా రంగాల వైపు వెళ్లాలని కలెక్టర్ల సదస్సుల్లోనే సీఎం వ్యాఖ్యలు చేయటం విడ్డూరమన్నారు. వ్యవసాయ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే 70 నుంచి 80 శాతం వరకూ ఉన్న ప్రజానీకానికి ఉపాధి, ప్రయోజనం చేకూరుతాయన్నారు. గతం నుంచే చంద్రబాబు రైతు వ్యతిరేకి అన్నారు. రైతులను, వ్యవసాయాన్ని తక్కువ చేసి మాట్లాడటం చంద్రబాబుకి అలవాటైందన్నారు. రైతుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి, అధికారం రాగానే రైతులను గురించి ఆలోచించటమే మానేశారని ఆరోపించారు. రూ 3 వేల కోట్లు స్థిరీకరణ నిధి నేటికీ ఏర్పాటుకాలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా, వ్యవసాయ రంగాన్ని సైతం నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఇదే కొనసాగితే 2004 పునరావృతం అవుతుందని, చంద్రబాబు ఇంటిదారి పట్టక తప్పదని స్పష్టంచేశారు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు బాకీ బాబు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top