ఆకేపాడులో భక్తిశ్రద్దలతో వరలక్ష్మీవ్రత వేడుకలు

ఆకేపాడు (రాజంపేట టౌన్‌) : మండలంలోని ఆకేపాడు గ్రామంలో వెలసిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఎంపీపీ ఆకేపాటి రంగారెడ్డి, వైయస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీరెడ్డిల ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రత వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మీవ్రత వేడుకల్లో ఆకేపాడు పరిసర ప్రాంతాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. దీంతో శ్రీమహాలక్ష్మీదేవి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.  అమ్మవారి వ్రతం జరుగుతున్నంత సేపు ఆకేపాడు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అంతకు ముందుగా వేదపండితులు వేదమంత్రోచ్ఛనలతో హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మీవ్రతం కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది మహిళలకు, ప్రజలకు ఆకేపాటి రంగారెడ్డి, ఆకేపాటి శ్రీనివాసులురెడ్డిల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా రాజంపేట పట్టణంలోని అమ్మవారిశాలలో, శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో వరలక్ష్మీదేవి వ్రత మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

Back to Top