ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు

  • పనికిరాని వ్యక్తి మాటలకు అభిమానులు బాధపడొద్దు
  • కొన్ని పార్టీల నాయకులు కావాలనే వ్యాఖ్యలు చేయించారు
  • గౌతంరెడ్డిని సస్పెండ్‌ చేసి మా పార్టీ సరైన నిర్ణయం తీసుకుంది
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ
విజయవాడ: ఓ పనికిరాని వ్యక్తి వంగవీటి మోహనరంగాపై చేసిన వ్యాఖ్యలకు అభిమానులు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని, కొంత మంది పార్టీ నాయకులు కులం పరంగా చేయించారని తేలిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ అన్నారు. విజయవాడ వంగవీటి రంగా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎవరైనా, ఎంతటివారైనా దివంగత రంగాను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, రంగా అభిమానులంతా తిరగబడతారన్నారు. అప్పుడు విమర్శలు చేసిన, చేయించిన వారి బతుకేంటో అర్థం అవుతుందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా ఉన్న గౌతంరెడ్డిని సస్పెండ్‌ చేసి మా పార్టీ సరైన నిర్ణయం తీసుకుందన్నారు. ఇంత నీచమైన వ్యక్తిని ప్రోత్సహించినందుకు పార్టీ కూడా బాధపడుతుందన్నారు. 

రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం
సీపీఐ పార్టీని అడ్డు పెట్టుకొని వందల కోట్లు సంపాదించుకొని, రెండు మర్డర్‌ కేసులతో నగరం నుంచి బహిష్కరణకు గురయ్యాడని, భూదందాలు, కేబుల్‌ మాఫియా అన్నీంట్లోను గౌతంరెడ్డి పాత్ర ఉందన్నారు. ఒక వ్యక్తి నోటి దూలతో రంగా అభిమానులంతా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి దాపరిచిందన్నారు. గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు కార్యాలయానికి వస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. మాజీ మహిళా ఎమ్మెల్యే, రంగా సతీమణి రత్నకుమారిని రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీసులు తీసుకెళ్లారన్నారు. పోలీసులు అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేందుకు ఇలా వ్యవహరించారన్నారు. పోలీసుల తీరుపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు. గౌతంరెడ్డి అనే నీచమైన వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు రంగా అభిమానులు, వైయస్‌ఆర్‌ సీపీ నేతలు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. రానున్న రోజుల్లో ఎవరైనా రంగాపై విమర్శలు చేస్తూ చూస్తూ ఊరుకునేది లేదని, తిరుగుబాటు ఖాయమన్నారు. 
Back to Top