టిడిపి, బిజెపిల మోసాన్ని వివరించడానికే వంచన పై గర్జన

జిల్లాల అభివృద్ధికి నిధులివ్వలేదు

నాలుగేళ్లుగా టిడిపి, బిజెపిలు ప్రజలను మోసం చేస్తున్నాయి

హోదా కోసం పోరాడిన వారిపై కేసులు పెట్టారు. 

నాలుగేళ్లుగా అవినీతి పాలన చేస్తున్న టిడిపి

వైయస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొత్స 

అనంతపురం:   తెలుగుదేశం, బిజెపి లు
రాష్ట్ర ప్రజలకు చేసిన మోసం,అన్యాయంపై ప్రజలను చైతన్య వంతులను చేయడానికే వంచనపై
గర్జన దీక్షలను చేపడుతున్నామని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స
సత్యనారాయణ అన్నారు. అనంతపురంలో వంచన పై గర్జన దీక్ష ప్రారంభంలో ఆయన ప్రసంగిస్తూ
2014 ఎన్నికలకు ముందు బిజెపి నాయకులు, నేటి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, తెలుగుదేశం
నాయకులు రాష్ట్ర నలుమూలలా పర్యటించి ప్రజలకు అనేక రకాలైన హామీలిచ్చి, రాజకీయ లబ్ధి
పొంది తరువాత ఎలా మోసం చేశారన్న దానిని ప్రజలందరూ ఒకసారి గుర్తుకు
చేసుకోవాలన్నారు. అటు తరువాత చీకటి ఒప్పందాలతో, ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ
ప్రజలను మరోసారి మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. నాలుగు సంవత్సరాలుగా మిత్రపక్షాలుగా
ఉన్న ఈ రెండు పార్టీలకు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్టదని, కడపలో ఉక్కు పరిశ్రమ
ప్రారంభించాలని, బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజి ఇవ్వాలన్న విభజన చట్టంలోని అంశాలను
విస్మరించారన్నారు. తమ స్వార్థం కోసం వీటిని తుంగలోకి తొక్కి ఇప్పుడు మళ్లీ
ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది
నుంచి కూడా ప్రజల పక్షాన ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల కోసం పోరాటాలు
చేస్తుంటే, హేలన చేయడమే కాకుండా, ఉద్యమాలు చేస్తున్న వారిపై కేసులు పెట్టి జైళ్లలో
పెట్టారని ఆయన అన్నారు. ఇలాంటి టిడిపి  హోదా కావాలని డ్రామాలు ఆడుతోందని, ప్యాకేజి
కావాలని  అడిగి హోదాకు తూట్లు పొడిచిన
విషయాన్ని ఎవరూ మరచిపోరన్నారు. కడపలో వారి భాషలోనే తుక్కు ఫ్యాక్టరీ కోసం దీక్షల
పేరుతో ఏరకంగా  మభ్యపెట్టే యత్నం చేశారో
ప్రజలందరూ చూశారన్నారు. ఇలాంటి వంచన కార్యక్రమాలతో పబ్బం గడుపుకోవాలనుకుంటున్న నయవంచన
వైఖరిపై ప్రజలను అప్రమత్తులను చేసేందుకే తాము వంచన పై గర్జన దీక్షలను చేస్తున్నట్లు
బొత్స వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా
జరుగుతున్న ఈ ఉద్యమంలోప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 

Back to Top