వంచనపై వైయస్‌ఆర్‌ సీపీ గర్జన

జూన్‌ 2వ తేదీన నెల్లూరు పీఆర్‌ కళాశాల మైదానంలో వంచనపై గర్జన
పార్టీ నేతలతో సమావేశమైన బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డినెల్లూరు: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల్లో బీజేపీ, టీడీపీ చేసిన మోసాలపై ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరు ఉధృతం చేసింది. వంచనపై గర్జన పేరిట విశాఖ తరహా దీక్షకు సన్నద్ధమవుతోంది. నెల్లూరు జిల్లా కేంద్రంగా మరోసారి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రరాష్ట్రానికి జరిగిన వంచనపై గర్జించనుంది. నెల్లూరు వీఆర్‌ కళాశాల గ్రౌండ్‌లో జూన్‌ 2వ తేదీన వంచనపై గర్జన చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిలు పరిశీలించారు. అనంతరం పార్టీ సీనియర్‌ నేతలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నేతలు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మేరుగ మురళీధర్‌లతో వారు సమావేశమయ్యారు. 

ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాం: సజ్జల

రాష్ట్రానికి జరిగిన మోసంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా జూన్‌ 2వ తేదీన వంచనపై గర్జన దీక్ష చేపట్టనున్నామన్నారు. ఏప్రిల్‌ 30వ తేదీన విశాఖలో చేపట్టిన దీక్ష విజయవంతమైందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో జూన్‌ 2న నెల్లూరులోని వీఆర్‌ కళాశాల గ్రౌండ్‌లో దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజీనామా చేసిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి పాల్గొంటారన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మరోసారి వెలుగెత్తి చాటి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. 

హోదా కోసం పోరాడుతున్న నాయకుడు వైయస్‌ జగన్‌: బొత్స

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర మోసాలకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతుందన్నారు. ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా జూన్‌ 2న నెల్లూరులో వంచనపై గర్జన దీక్ష చేపడుతున్నట్లు వివరించారు. దీక్షలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పెట్రోల్, నిత్యవసర ధరలే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని బొత్స అన్నారు. గతంలో కేంద్రం పెట్రోల్, గ్యాస్‌ ధరలు పెంచితే.. కేంద్రంతో పనిలేకుండా రాష్ట్రంలో వాటి రేట్లు తగ్గించిన ఘనత దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిదని గుర్తు చేశారు.  
Back to Top