‘వైయస్‌ను విమర్శిస్తే బాబును నడవనివ్వం’

ఏలూరు : ప్రజా సమస్యలను ‌గాలికి వదిలేసి పాదయాత్ర పేరుతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డ్రామాలాడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొయ్యే మోషేన్‌రాజు ఆరోపించారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడి‌ని విమర్శిస్తూ, బురదచల్లడం మానుకోకపోతే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు మరోమారు సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేస్తే వైయస్‌ఆర్‌సిపి శ్రేణులంతా కలిసి ఆయన పాదయాత్రను జిల్లాలో నడవనివ్వకుండా అడ్డుకుంటామని మోషేన్‌రాజు తెలిపారు.

120 జి.ఓ.ను తెచ్చి కొల్లేరును అభయారణ్యం పరిధిలోని మత్స్యకారుల జీవితాలను నాశనం చేసిన చంద్రబాబు వైయస్‌పై బురద చల్లటం సిగ్గు చేటు అన్నారు. సుప్రీంకోర్టు జోక్యంతో సాధికారిత కమిటీ ఆదేశాల మేరకు కొల్లేరు చెరువులను ధ్వంసం చేసినా ఐదో కాంటూరును మూడో కాంటూరుకు కుదించి వారిని ఆదుకోవడానికి అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపచేసిన మహానుభావుడు వైయస్‌ఆర్ అన్నారు. ఆపరేష‌న్ కొల్లేరు ద్వారా నష్టపోయిన వారిని ఆదు‌కునేందుకు కోట్లాది రూపాయలతో పునరావాసం ప్యాకేజీ అమలుచేసి చూపించిందీ మహానేత వైయస్‌ఆర్‌ అని మోషేన్‌ రాజు గుర్తు చేశారు. అలాంటి వైయస్‌ఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని, పాదయాత్రను జిల్లాలో సాగనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
Back to Top