వైయస్ ఇచ్చిన ఊతాన్ని తొలగించారు

ఖమ్మం:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఇచ్చిన పింఛనుకూ తూట్లు పొడుస్తున్నారని వికలాంగులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వం వికలాంగులను గాలికొదిలేసిందనీ, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితులు మారతాయనీ శ్రీమతి వైయస్ షర్మిల భరోసా ఇచ్చారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 129 వ రోజున చెరువుమాదారం గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. ఇందులో మాట్లాడిన వికలాంగులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆమెకు వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల మాట్లాడుతూ మహానేత హయాంలో 71 లక్షల మందికి పింఛన్లిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.


అంగవైకల్యం ఉన్నా ఆత్మస్థైర్యంతో నిలబడ్డామనీ, తమకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్  ప్రతి నెలా పింఛన్లిచ్చారనీ వికలాంగులు శ్రీమతి షర్మిలకు మొరపెట్టుకున్నారు.  ఆయన అందించిన ఊతకర్రను సదరన్ క్యాంపు పెట్టి ఈ పాలకులు లాగేసుకుంటున్నారని ఆరోపించారు. మానవతా దృక్పథంతో సహాయం చేయాల్సిన ప్రభుత్వం పింఛన్లకూ తూట్లు పొడుస్తోందన్నారు. ఆ దేవుడు మమ్మల్ని శారీరకంగా వికలాంగులను చేస్తే.. ఈ ప్రభుత్వం మానసిక వికలాంగులుగా మార్చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. మనసులేని పాలకుల ఏలుబడిలో రోజూ చస్తూ బతుకుతున్నామంటూ వికలాంగులు గోడు వెళ్లబోసుకున్నారు.

మానసిక వికలాంగులకు పింఛన్ ఇచ్చిన వైయస్
వికలాంగుల ఆవేదనపై షర్మిల స్పందిస్తూ.. ‘మానసిక వికలాంగులకు కూడా పింఛన్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ఆరేనని చెప్పారు. చంద్రబాబునాయుడు హయాంలో కేవలం 16 లక్షల మందికి పింఛనిస్తే, వైయస్ఆర్ 71 లక్షల మందికి ఇచ్చారన్నారు. అంటే 55 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చారని పేర్కొన్నారు. వికలాంగులపట్ల  ఇంకొంచెం ప్రేమ, అప్యాయతతో మెలగాలని, అలా చేయకపోతే మనకు, రాక్షసులకు పెద్దగా తేడా ఉండదని వైయస్ఆర్ అనేవారన్నారు.

మహానేత రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఆయన పథకాలను తుంగలో తొక్కుతోందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ఉన్న పింఛన్లు కూడా ఊడపీకేస్తున్న ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అమ్మా..! మీరు అధైర్యపడవద్దు. త్వరలోనే మీరు కోరుకున్నట్టుగానే జగనన్న వస్తాడు. మహానేత మాదిరిగానే మిమ్మల్ని ఆదరిస్తాడని భరోసా ఇచ్చారు.

'ఎందుకంటే నేను రాజన్నను చూశాను, జగనన్నను చూశాను. మీ గురించి జగనన్న ఎప్పుడో ఆలోచన చేశారు. మీరు చేస్తున్న డిమాండ్లలో చాలావరకు జగనన్న ప్లీనరీలోనే ప్రకటించారు. మీ అందరినీ జగనన్న సంతోషంగా ఉంచుతారు. చదువు లేని వికలాంగులకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలిస్తారు. మీ కాళ్ల మీద నిల బడే విధంగా ప్రోత్సహిస్తారు. తల్లిదండ్రులు కూడా వికలాంగులను చిన్న చూపు చూడకుండా ప్రోత్సాహమిస్తే సామాన్య మనిషికంటే ఎక్కువ ప్రతిభ చూపిస్తారు’ అని శ్రీమతి షర్మిల చెప్పారు.

మూడేళ్లకోసారి తమకు మూడు చక్రాల సైకిళ్ళను ఇవ్వాలనీ, చదువుకున్న వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలనీ,  మిగిలిన వారికి రుణాలిచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వారి కాళ్ల మీద వారు నిలబడేటట్టుగా పోత్సహించాలనీ, వికలాంగులకు ప్రస్తుతం అమలుచేస్తున్న 3 శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలనీ,  అర్హులైన వికలాంగులందరికీ పింఛన్లిచ్చి, పింఛన్‌ను రూ.1,000కి పెంచాలనీ, నెలకు 35 కిలోల బియ్యం ఇవ్వాలనీ,  వికలాంగుని కుటుంబానికి ఇందిరమ్మ పథకం కింద ప్రభుత్వమే ఇల్లు కట్టివ్వాలనీ,  ఉచిత బస్సు, రైలు పాసులు ఇవ్వాలనీ, ప్రభుత్వం వికలాంగులను గౌరవంగా చూడాలనీ, పరిశీలన పేరుతో ఏటా ఇబ్బంది పెట్టే బదులు వైయస్ఆర్ మాదిరిగా క్షేత్ర సహాయకుడిని పెట్టి వెరిఫికేషన్ చేయించాలనీ వికలాంగులు కోరుతున్నారు.

రైతులు, మహిళలను పలకరిస్తూ ముందుకు..
మంగళవారం 129వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం రాయగూడెం నుంచి ప్రారంభమైంది. శ్రీమతి షర్మిల రైతులు, మహిళలు, యువతను పలకరిస్తూ బుద్దారం, చెర్వుమాధారం గ్రామాల మీదుగా అజయ్ తాండా శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మొత్తం 13.9 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1,744.2 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో రోజూ నడుస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, ఆర్కే, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, అందూరి రాజగోపాల్‌రెడ్డిలతో పాటు మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చందా లింగయ్యదొర, బానోతు మదన్‌లాల్, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, స్థానిక నేతలు రామసహాయం నరేష్‌రెడ్డి, మట్టా దయానంద్, నంబూరి రామలింగేశ్వర్‌రావు, సాధు రమేష్‌రెడ్డి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.

Back to Top