వైయస్‌ది ప్రాణం పోసే చెయ్యి: షర్మిల

కారంపూడి (గుంటూరుజిల్లా), 26 ఫిబ్రవరి 2013: 'రాజశేఖరరెడ్డిగారు ఫ్యాక్షనిస్టట. పరిటాల రవిని ఆయన చంపించారట. చంద్రబాబు నాయుడిని కూడా చంపడానికి మహానేత ప్లాన్‌ చేశారట' చంద్రబాబు నాయుడి మాటలు వింటుంటే ఆయన గురించి ఏమనుకోవాలో కూడా అర్థం కావడంలేదని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. 'రాజశేఖరరెడ్డిగారు ఎంత మంచివారో... ఎంత మంచి మనసున్నవారో.. ఆయన పెద్ద మనసు గురించి ఈ రాష్ట్రంలో చిన్నపిల్లలను అడిగినా చెబుతార'న్నారు. రాజశేఖరరెడ్డిది ప్రాణం పోసే చెయ్యే గానీ ప్రాణం తీసే చెయ్యి కాదని శ్రీమతి షర్మిల అన్నారు. 'రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిని, మా సొంత అబ్బ (తాత)ను చంద్రబాబు నాయుడి అండ చూసుకుని, ఆయన ప్రోద్బలంతో బాంబుదాడి చేసి చంపేశారు. కానీ రాజశేఖరరెడ్డి అప్పుడు ఏమన్నారో తెలుసా? దేవుడు ఉన్నాడు.. దేవుడే నిర్ణయం చేస్తాడన్నారు. రాజశేఖరరెడ్డి ఫ్యాక్షనిస్టు కాదు కనుకనే హత్య చేసిన వారు ఈ రోజుకూ బహిరంగంగా బయట తిరుగుతున్నారు. వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు రాజశేఖరరెడ్డికి తెలియవన్నా'రు.

‌అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు, దానితో అంటకాగుతూ పరోక్షంగా మద్దతు ఇస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 75వ రోజు మంగళవారం గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం కారంపూడిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ఉద్వేగంగా ప్రసంగించారు. శ్రీమతి షర్మిల బహిరంగ సభకు నాగులేరు సాక్షిగా అభిమానులు, పార్టీ శ్రేణులు పోటెత్తారు. సభ ప్రాంగణం అంతా జగన్నినాదాలతో హోరెత్తింది.

'వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుకు మాత్రమే అలవాటని, అందుకనే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉన్నా, దాన్ని దింపేసే అవకాశం వచ్చినా అవిశ్వాసం పెట్టరట' అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. కానీ కుట్రలు పన్ని, కుతంత్రాలు చేసి, అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను మాత్రం జైలులో పెట్టించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ వాళ్ళతో కుమ్మక్కయ్యి చంద్రబాబు నాయుడు సిబిఐని తన ఇష్ట వచ్చినట్లు వాడుకుంటున్నారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. సిబిఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని సిబిఐ మాజీ డైరెక్టర్‌ జోగిందర్‌ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

కత్తులు గొడ్డళ్ళు అక్కర్లేదు.. అవిశ్వాసం చాలు: 
కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చంపడానికి కత్తులు, గొడ్డలు తీసుకోవాలని చంద్రబాబు ప్రజలకు చెప్తున్నారు. అయ్యా.. చంద్రబాబూ ఈ ప్రభుత్వాన్ని చంపడం కోసం కత్తులు, గొడ్డళ్లు అక్కర్లేదయ్యా.. మీ దగ్గరే అవిశ్వాసం అనే ఆయుధం ఉంది. దాన్ని ప్రయోగించి మీరు అంటున్నట్టుగానే ఈ చేతగాని ప్రభుత్వాన్ని దించండి. మీరు ఆ పని మాత్రం చెయ్యరు. ఎందుకంటే మీరు చేసిన అవినీతి పనుల మీద ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణ జరపకుండా మీకు అండగా ఉంటుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోకుండా మీరు రక్షణ కవచంగా ఉంటారు. ఇది మీ ఇద్దరి మధ్య కుదిరిన చీకటి ఒప్పందం.

బాబు దృష్టిలో బి.సి. అంటే ‘బాబు క్లాస్‌’:
మహానేత వైయస్‌ఆర్‌ బి.సి.ల కోసం ఏమీ చేయలేదని చంద్రబాబు అంటున్నారు. బి.సి.ల కోసం ఆయన ఏం చేశారో, ఆయన పెట్టిన ప్రతి సంక్షేమ పథకం చెప్తుంది. అన్ని పథకాలూ కొద్దిసేపు పక్కన పెడదాం. ఒక్క ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని తీసుకుంటే ఎన్నో లక్షల మంది బి.సి. విద్యార్థులు పెద్ద చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వారిని చూస్తే.. వైయస్‌ ఏం చేశారో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడుకు తెలిసిన బి.సి.లు బ్యాక్‌వర్డు క్లాసులు కాదు. ఆయన దృష్టిలో ‘బి.సి.లు అంటే.. బాబు క్లాసు’... అంటే ఆయన మనుషులు నామా నాగేశ్వరరావు, సి.ఎం. రమేష్‌ లాంటి వాళ్లు. వాళ్లకు వైయస్‌ఆర్‌ హయాంలో ఏమీ చేయలేదని చంద్రబాబు ఉద్దేశం కావచ్చు. సహకార పరిశ్రమలను చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అనుచరులకు పప్పు బెల్లాల కింద అమ్మేసుకున్నారు. నిజాం షుగర్సు పరిశ్రమను ముక్కలు ముక్కలుగా చేసి తన అనుయాయులకు ఇచ్చేశారు. ఖమ్మం జిల్లా రైతాంగానికి అండగా నిలిచిన పాలేరు చక్కెర పరిశ్రమలను చంద్రబాబు ఆయన పార్టీకే చెందిన ఎం.పి. నామా నాగేశ్వరరావుకు కారుచౌకగా కట్టబెట్టారు. కోట్ల విలువ చేసే నెల్లూరు స్పిన్నింగ్‌ మిల్లును తెలుగుదేశం పార్టీకే చెందిన సిఎం రమేష్‌ కు ఇచ్చేశారు. హైదరాబాద్‌లో ఉన్న రిపబ్లిక్‌ ఫోర్జు కంపెనీని దేవేందర్‌గౌడ్‌కు ధారాదత్తం చేశారు.

మాచర్ల అంటే మహానేత ఎంతో అభిమానం:
మాచర్ల అంటే మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డికి చాలా అభిమానం అని శ్రీమతి షర్మిల అన్నారు. అందుకే తన ఐదేళ్ళ పాలనా కాలంలో రూ.900 కోట్లతో మాచర్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారన్నారు. కృష్ణా నీళ్ళు, డిగ్రీ కాలేజిలు, హాస్టళ్ళకైతేనేమి, వేలకొద్దీ పక్కా ఇళ్ళు కట్టడానికైతేనేమి వైయస్‌ఆర్ చాలా కృషి చేశారన్నారు.‌ మాచర్లలో ఒక లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టుతో పాటు మరొకటి ఏర్పాటు చేసి 65 వేల ఎకరాలను నీళ్ళివ్వాలని కలలు కన్నారన్నారు. ఆయన మరణంతో ఆ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే 50 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేసే రైతులున్నారని, వారి ప్రయోజనం కోసం ఒక మిర్చి మార్కెట్‌ యార్డు ఏర్పాటు చేయాలనుకున్నారని శ్రీమతి షర్మిల తెలిపారు. ఒక్కొక్క రైతుకు ఒక్కొ క్వింటాలుకు వెయ్యి రూపాయలు మిగిలించాలని ఆశపడ్డారు. కానీ, ఆకస్మికంగా మహానేత మన మధ్య నుంచి వెళ్ళిపోవడంతో ఆ కల నెరవేరలేదని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, రైతులంటే లెక్కే లేదని, చిన్నచూపు అని దుయ్యబట్టారు. వైయస్‌ ఉన్నప్పుడు మిర్చి ధర క్వింటాలుకు రూ. 12 వేలు కూడా దాటిందని, కానీ ఇప్పుడు రూ. 5 వేలు కూడా లేదన్నారు.

ఇటీవలి వర్షాలకు మిర్చి తడిసిపోయిందని, తడిసిన మిర్చిని రూ. 3 వేలకు కొనే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు విద్యుత్‌తో పాటు నీళ్ళు కూడా సరఫరా చేయడంతో ఎకరాకు 30 క్వింటాళ్ళ వరకూ మిర్చి దిగుబడి వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు ఎకరాకు 15 లేదా 20 క్వింటాళ్ళకు మించి రావడం లేదన్నారు. మిర్చి రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక పత్తిరైతు నిన్ననే ఆత్మహత్య చేసుకున్నాడని విన్నాక మనసుకు చాలా బాధ కలిగిందన్నారు. వైయస్‌ ఉన్నప్పుడు పత్తికి క్వింటాల్‌కు రూ. 7 వేలు కూడా పలికిందన్నారు. కానీ ఇప్పుడు పత్తికి మద్దతు ధర కేవలం రూ.3,900 ఉందని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వం రైతన్నను నిర్లక్ష్యం చేసిందని, పూర్తిగా దగా చేస్తోందని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి 2012 మే 24న ఇదే మాచర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర చేస్తుండగా సిబిఐ విచారణ కోసం మధ్యలోనే హైదరాబాద్‌ వెళ్ళారు. అదే నెల 27వ తేదీన ఆయనను సిబిఐ అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్బంధించింది. సరిగ్గా 9 నెలల తరువాత జననేత సోదరి శ్రీమతి షర్మిల ఇదే గ్రామంలో బహిరంగ సభలో మాట్లాడడం విశేషం. శ్రీమతి షర్మిల సభకు కారంపూడి ఊరు ఊరంతా జనసంద్రంగా మారింది.

గురజాల ప్రజలు ఇచ్చిన తీర్పుకు వందనం:
‘ఉప ఎన్నికల సందర్భంగా తొమ్మిది నెలల కిందట జగనన్న ఇదే కారంపూడిలో ఇదే సెంటర్లో మీ ముందు నిలబడి మాట్లాడారు. ఇక్కడ మీటింగ్‌ తరువాత సిబిఐ వాళ్లు విచారణ కోసమని జగనన్నను హైదరాబాద్‌ కు పిలిచి అక్కడే అదుపులోకి తీసుకున్నారు. కానీ మీరు జగనన్న నిర్దోషి అని పూర్తిగా నమ్ముతున్నట్టు అదే ఉప ఎన్నికల్లో తీర్పునిచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నిలబడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డన్నను గొప్ప మెజార్టీతో గెలిపించారు. అందుకు మీకు చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని షర్మిల కారంపూడి సభలో అన్నారు. నాడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి సభకు ఎంత మంది వచ్చారో.. మంగళవారం కూడా ఆయన అక్రమ అరెస్టును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు కట్టుకొని అంతకంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు శ్రీమతి షర్మిల సభకు తరలి వచ్చారు. శ్రీమతి షర్మిల అడుగులో అడుగు వేసి కదం తొక్కారు.
Back to Top