'వైయస్‌ఆర్‌సిపిపై టిడిపి అసత్య ప్రచారం'

విజయవాడ : ప్రజారాజ్యం పార్టీ లాగానే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా కాంగ్రెస్‌లో విలీనం అవుతుందంటూ టిడిపి గోబెల్సు ప్రచారం చేస్తోందని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన నిప్పులు చెరిగారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యే ప్రశ్నే లేదని ఆమె తేల్చిచెప్పారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు ధోరణిని రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని కల్పన హెచ్చరించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో శనివారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. టిడిపి నాయకులు ఇప్పటికైనా వైయస్‌ఆర్‌సిపిపై దుష్ర్పచారం మానుకోవాలని హితవు పలికారు.

చంద్రబాబు తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ పాట, ఆంధ్రాకు వచ్చినప్పుడు ఆంధ్రా పాట పాడుతున్నారని కల్పన విమర్శించారు.‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ‌ఆమె ఆరోపించారు. కేంద్ర హోంమంత్రికి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబును కోస్తాంధ్రలో ప్రజలు ఏవిధంగా ఆదరిస్తారన్న భయం టిడిపి నాయకులకు పట్టుకుందని అన్నారు.
Back to Top