వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం తట్టుకోలేకే కుట్రలు

హైదరాబాద్, 26 జనవరి 2013:

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభ, తదనంతరం టీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలు గమనిస్తే అసలు సమస్య పక్కదారి పట్టిందనిపిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి  గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. శనివారం మధ్యాహ్నం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడినంత సేపూ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారన్నారు. మహానేత గురించి గానీ, శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి గానీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి గానీ విమర్శలు లేకుండా మాట్లాడలేకపోవడం చూస్తే.. రాయలసీమ, తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో తమ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకోలేకపోవడమే దీనికి కారణమని తేలుతోందని ఆయన చెప్పారు.
       కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు కుట్రపన్ని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్‌నూ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనీ  విమర్శిస్తున్నాయని తెలిపారు. తెలంగాణవాదాన్ని మహానేత ఏనాడు విమర్శించలేదని స్పష్టంచేశారు.  తెలంగాణకు మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డే అడ్డమన్నారనీ, అదే నిజమైతే ఆయన చనిపోయి మూడేళ్ళయినప్పటికీ  తెలంగాణ ఎందుకు తెచ్చుకోలేదనీ  గట్టు ప్రశ్నించారు. 'తెలంగాణకు ఎవరో అడ్డుపడుతున్నారని చెబుతున్నారు. యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇస్తానంటే ఎవరు వద్దంటారు? అణు ఒప్పందంపై బిల్లు ఆమోదిస్తే ఎవరు వద్దన్నారు? ఎఫ్డిఐ బిల్లు తెస్తే ఎవరు వద్దన్నారు?' అని ఆయన నిలదీశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్‌నూ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనీ విమర్శిస్తూ కాంగ్రెస్, టిఆర్ఎస్ కలిసి నాటకం ఆడుతున్నాయన్నాయని వివరించారు. నిజంగా తెలంగాణ రావాలని కెసిఆర్కు ఉందా? అన్న సందేహాన్ని ఆయన  వ్యక్తంచేశారు. టీ కాంగ్రెస్ ఎంపీలను ఆందోళన చేయమని చెప్పిందీ.. తెలంగాణ ఎంపీలను తెలంగాణకోసం ఉద్యమించమని చెప్పిందీ కూడా కాంగ్రెస్ అధిష్ఠానమేనని ఆయన ఆరోపించారు. రెండు పార్టీల సభల్లోనూ వైయస్ఆర్ను విమర్శస్తున్నారన్నారు. రెండుప్రాంతాల ప్రజలూ మహానేతను ఆరాధిస్తున్నారని గట్టు చెప్పారు.

     తెలంగాణపై నెలరోజుల్లో తేల్చి చెబుతామని చెప్పింది కాంగ్రెస్ అధిష్ఠానమేననీ, అదే పార్టీ ఇప్పుడు నెలంటే నెలకాదు.. వారమంటే ఏడు రోజులు కాదు అని తప్పించుకో జూస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. గత నెలలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం బోగస్ అని కేసీఆర్ అంటే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అద్భుతమని చెబుతున్నారని.. కలిసి నాటకమాడడం కాక ఇదేమిటని ఆయన ప్రశ్నించారు. గత నెల 28నుంచి తెలంగాణ అంశంపై తెలంగాణలోనూ, సమైక్యాంధ్రపై సీమాంధ్రలోనూ ఉద్యమాలు చేసింది ఎవరని కూడా ఆయన అడిగారు. రెండూ చేయించింది కాంగ్రెస్ అధిష్ఠానమేనని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇంత నాటకాలాడుతున్నప్పటికీ, ఆపార్టీని నిలదీయడం మాని మహానేత డాక్టర్ వైయస్ఆర్‌ను తప్పుపట్టడమేమిటన్నారు. కాంగ్రెస్‌ను టీఆర్ఎస్ సమర్థించడం కాదా అన్నారు. తెలంగాణ కావాలన్న ఆ ప్రాంత ప్రజల కాంక్షనూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న సీమాంధ్ర నాయకుల ఆకాంక్షనూ గౌరవించకుండా ఇరుప్రాంతాల వారితో కాంగ్రెస్ నాటకాలాడుతోందని స్పష్టంచేశారు.

     2009లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక నంద్యాల  ఎన్నికల సభలో మహానేత చేసిన ' తెలంగాణలో వీసా అవుతుంద'న్న వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. అది కేసీఆర్‌ను ఉద్దేశించింది తప్ప.. తెలంగాణను ఉద్దేశించింది కాదన్నారు. తెలంగాణను దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఏనాడూ విమర్శించలేదన్నారు. కేసీఆర్ను విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్లు భావించరాదన్నారు.  తెలంగాణవాదం సజీవంగా ఉండాలి తప్ప తెలంగాణ రాకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు తేలుతోందన్నారు. తెలంగాణవాదానికి రాజశేఖరరెడ్డిగారు ఎప్పుడూ వ్యతిరేకంకాదని మరోసారి స్పష్టంచేశారు. ఆయనే వ్యతిరేకమైతే రోశయ్య కమిటీని నియమించేవారే కాదన్నారు. డాక్టర్ వైయస్ఆర్‌ను విమర్శించడం వెనుక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాభవాన్ని తగ్గించే కుట్ర దాగుందన్నారు. ఆయనమీద ప్రేమతో 350 మంది మరణించిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలన్నారు. ఆయన పెట్టిన ప్రతి పథకమూ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలూ అభివృద్ధిచెందాలనే తపనతో ప్రవేశపెట్టినవేనన్నారు. ఆరోగ్యశ్రీ తెలంగాణకు ఎక్కువ ఉపయోగపడిందని చెప్పగలమన్నారు. 14 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన ఘనత కూడా మహానేతదేనన్నారు. ఉచిత కరెంటు పథకం తెలంగాణ ప్రాంతానకి ఎంతో ఉపయోగపడిందన్నారు. 1956నుంచి 2004 వరకూ రాష్ట్రంలో 42 లక్షల ఎకరాలు సాగులోకి వస్తే... ఒక్క మహానేత పాలనలో  21 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని తెలిపారు. వీటిలో 6.38 లక్షల ఎకరాలు తెలంగాణలోవేనన్నారు. తెలంగాణ కావాలని కోరుకోవడంలో తప్పులేదు. కాని దాని అభివృద్ధికి కృషి చేసిన మహానేతను మరువకూడదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ తెరలేపిన కొత్ర డ్రామా కారణంగానే.. పరిస్థితులు క్షీణించాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగానే తెలంగాణపై నిర్ణయం తీసుకోలేకపోతున్నామనే ప్రకటన చేయడానికి ముడిసరుకు అందిస్తున్నారని గట్టు విరుచుకుపడ్డారు. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికీ, వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రాభవాన్ని తగ్గించడానికీ వీరు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే ముందు మీ వైఖరులను సమీక్షించుకుంటే మంచిదన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్నారని అంటున్న కేటీఆర్‌కు 610 జీవోను రద్దు చేయాలన్నన కేసీఆర్ వాదన వినిపించలేదా అని గట్టు ప్రశ్నించారు. నలబై ఏళ్ళుగా ఇచ్చంపల్లి ప్రాజెక్టు పూర్తికాలేదని ధ్వజమెత్తుతున్న కేటీఆర్‌కు.. ఆయన తండ్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా మొత్తం ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు ఈ విషయం గుర్తుకురాలేదా అని నిలదీశారు.

     కేసీఆర్, కేటీఆర్ మమ్మల్ని తిట్టారని రాజమండ్రి సభలో ఉండవల్లి అన్నారన్నారు. సంక్షేమ పథకాలను ప్రస్తావించారు కానీ,  ఆయన ఏ అంశంలోనూ రాజశేఖరరెడ్డి గారి పేరు ఎత్తలేదన్నారు. తెలంగాణ అంశాన్ని సాగదీశేలా వ్యవహరించవద్దని గట్టు వారికి సూచించారు.

Back to Top