'వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా తథ్యం'

‌హైదరాబాద్, 19 జనవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలూ క్యూ కడతాయని పార్టీ లోక్‌సభ సభ్యుడు, సిజిసి సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయస్‌ఆర్‌సిపి ప్రభంజనం తథ్యం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 200కు పైగా అసెంబ్లీ స్థానాల్లోను, 35 లోక్‌సభా నియోజకవర్గాల్లోను వైయస్‌ఆర్‌సిపి విజయ ఢంకా మోగించబోతోందని ఆయన అన్నారు. లోక్‌సభా స్థానాలు 35 గెలుచుకున్న తరువాత అప్పటి పరిస్థితులను బట్టి కేంద్రంలో ఏదైనా లౌకిక కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. దేశ రాజకీయాల్లో శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి  కీలక భూమిక పోషిస్తారన్నారు.

రాజకీయ లబ్ఢి కోసం కాంగ్రెస్‌ నాయకులు పూటకో మాట మాట్లాడుతున్నారని మేకపాటి ఎద్దేవా చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు రోజూ నీతులు వల్లిస్తున్నారని మేకపాటి అన్నారు. రోజూ నీతిని గురించి మాట్లాడడం ఆయన ఆరోగ్యానికే మంచిది కాదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. ప్రపంచంలోనే చంద్రబాబు పెద్ద అవినీతిపరుడని తెహల్కా రాసిన కథనాలను బాబు అప్పుడే మరిచిపోయారన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వైయస్‌ఆర్‌సిపి కోరుకుంటోందన్నారు.
Back to Top