మహానేత పథకాలకు తూట్లు: ద్వారంపూడి

హైదరాబాద్:

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి(కాంగ్రెస్) గురువారం ఉదయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉన్న నివాసంలో పార్టీ కండువా వేసి పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆయనను ఆహ్వానించారు. అనంతరం ద్వారంపూడి విలేకరులతో మాట్లాడారు. చాలామంది ఎమ్మెల్యేలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా వచ్చి పార్టీలో చేరవచ్చని చెప్పారు. దీనికి ఫలానా తేదీ అని లేదన్నారు. నియోజకవర్గాలలో ఏ ఎమ్మెల్యేలకూ పనులు అవ్వడం లేదని తెలిపారు. చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ పథకాలు అమలు కావడంలేదని చెప్పారు. ముఖ్యంగా కరెంటు సమస్య చాలా  ఎక్కువగా ఉందనీ, చార్జీలు విపరీతంగా పెంచేశారనీ ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సమయంలో నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తాను చేరలేదన్నారు. అప్పట్లో ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీ కారణంగా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశానని ద్వారంపూడి పేర్కొన్నారు. ఆ హామీలేవీ నెరవేరలేదని చెప్పారు. ఏ కార్యక్రమమూ అమలు కాలేదన్నారు. అయినప్పటికీ ఓ ఏడాది వేచి చూశానన్నారు. ఒక కొత్త రేషన్ కార్డు లేదు.. పింఛను లేదు... అన్నీ సమస్యలేనని తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు, క్యాడర్‌తో సమావేశమై ఆలోచించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని వివరించారు. మంచిరోజు కాబట్టి ఈరోజు పార్టీలో చేరాను. విభజనలు, సమైక్యం గురించి మాట్లాడేంత పెద్ద నాయకుడిని కాదన్నారు. పార్టీ వైఖరికి కట్టుబడి ఉంటానన్నారు. పార్టీలో కార్యకర్తగా కొనసాగుతాననీ, పార్టీ ఆదేశాల మేరకు వ్యవహరిస్తానని ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top