వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ దీక్షకు వామపక్షాల మద్దతు

హైదరాబాద్, 3 ఏప్రిల్‌ 2013: విద్యుత్ ఛార్జీల పెంపు‌నకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ‌, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు వామపక్ష నేతలు సంఘీభావం తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు, ఇతర వామపక్ష నేతలు హైదరాబాద్‌ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సులోని దీక్షాస్థలిని బుధవారం ఉదయం  సందర్శించి ఎమ్మెల్యేలను పరామర్శించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న 'కరెంట్‌ సత్యాగ్రహా'నికి వారు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి విద్యుత్ ‌ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని రాఘవులు డిమాండ్ చేశారు.

అసెంబ్లీ సమావేశాల వరకు ఆందోళన:
‌విద్యుత్ సమస్య నుంచి కాంగ్రె‌స్‌ పార్టీ నాయకులు పారిపోతున్నారని దీక్షా శిబిరం వద్ద మాట్లాడిన రాఘవులు ఎద్దేవా చేశారు. వచ్చే శాసనసభ సమావేశాల వరకూ ఆందోళన కొనసాగిస్తామని ఆయన చెప్పారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని లేదంటే ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దీక్షకు ‌సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందన్నారు. ప్రతిపక్షాల అనైక్యత కారణంగానే ఈ మైనార్టీ ప్రభుత్వం ఇంకా కొనసాగుతోందని చెప్పారు.

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ధనికులెవరో, పేదలెవరో తెలియడం లేదని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకుని బొత్స మాట్లాడాలన్నారు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీలతో పేదలు, సామాన్యులకే అధిక భారం పడిందన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా ‌ఈ నెల 9న అన్ని పక్షాలతో కలిసి రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్లు‌ రాఘవులు పేర్కొన్నారు.
Back to Top