వామపక్ష నేతలకు విజయమ్మ సంఘీభావం

హైదరాబాద్, 27 మార్చి 2013:

విద్యుత్తు సమస్యపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలో కార్యాచరణ ప్రకటిస్తుందని పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తెలిపారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వామపక్షాల నేతలను బుధవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్తు సమస్యపై ముఖ్యమంత్రి ఏ విధమైనా హామీ ఇవ్వలేకపోయారని ఆమె ఆరోపించారు. ఈ అంశంలో కిరణ్ ప్రభుత్వం కిరాతంగా ప్రవర్తింస్తోందని మండిపడ్డారు. ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదని కిరణ్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. విద్యుత్తు సమస్యపై దివంగత మహానేత ముందుండి అన్ని విధాలా పోరాడారని చెప్పారు. ప్రజా సమస్యలపై ఎవరు ఆందోళన చేసినా తమ పార్టీ అండగా నిలుస్తుందని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు.
గాంధీ ఆస్పత్రిలో ఉన్న తాము దీక్షలను విరమించినట్లు వామపక్షాల నేతలు అంతకు ముందు తెలిపారు. ఇందిరా పార్కు వద్ద చేపట్టిన దీక్షలను పోలీసులు మంగళవారం భగ్నం చేసి, వారిని గాంధీ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. నారాయణ, రాఘవులు సహా మిగిలిన నేతలు బుధవారం దీక్ష చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రజా క్షేత్రంలో పోరాడాలని భావించారు. దీనితో నిరాహార దీక్షను విరమించినట్లు నారాయణ, రాఘవులు పేర్కొన్నారు. వీరికి శ్రీమతి విజయమ్మ సంఘీభావం ప్రకటించారు.

Back to Top