కలెక్టర్ల సమావేశంలో కాలక్షేప కబుర్లు

ఎజెండా లేకుండా కలెక్టర్లతో సమీక్ష
కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కు
కిందిస్థాయి నుంచి ఫైల్స్‌ రావడం లేదని బాబు మొసలికన్నీరు
దేవుడిపై ఉన్న నమ్మకాన్ని కించపరుస్తారా
అధికారులను బలిపశువులను చేస్తారా
చంద్రబాబుపై ధ్వజమెత్తిన వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్‌: చంద్రబాబు ప్రభుత్వానిది కమీషన్ల రాజ్యమని, రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన కొనసాగిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మమండిపడ్డారు.  అందుకు ఈ రోజు జరిగిన కలెక్టర్ల సమావేశమే నిదర్శనమని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.  హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరులతో మాట్లాడుతూ....ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల సమావేశంలో బాబు చేసిన కామెంట్స్‌పై ఆమె ఫైరయ్యారు.  ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు సోది ఉపన్యాసాలు చేయడం బాధాకరమన్నారు. 

కిందస్థాయి నుంచి ఫైల్స్‌ రావడం లేదని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు ఫైల్స్‌ తయారు చేసి కిందకి పంపిస్తుంటే కిందిస్థాయి నుంచి ఫైల్స్‌ ఎలా వస్తాయని ప్రశ్నించారు. పైరవీలతో అధికార పార్టీకి చెందిన నాయకులకు, కాంట్రాక్టర్‌ల ఫైల్స్‌పై సంతకాలు పెడుతున్నారని ఫైరయ్యారు. రెండు సంవత్సరాల కాలం నుంచి బాబు కాంట్రాక్టర్‌లు, అధికారులతో కుమ్మకై... కాంట్రాక్ట్‌లో ఎక్కువగా కోడ్‌ చేసి దక్కించుకొని, వాటాలు పంచుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రాజెక్టుల వ్యయం రూ. 20 వేల కోట్లు పెంచుతూ పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. ఇద్దరు చీఫ్‌ సెక్రటరీలు ఆ ఫైల్స్‌పై సంతకం పెట్టడానికి నిరాకరిస్తే ...సంతకం పెట్టే విధంగా చంద్రబాబు వారిపై ఒత్తిడి తీసుకువచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు. చీఫ్‌ సెక్రటరీలు నిరాకరించడంతో క్యాబినెట్‌ మీటింగ్‌ పెట్టి ఆ ప్రాజెక్టు అంచనాలు పెంచుతూ ఆమోదించారని విమర్శించారు. ఏ పనిచేసినా ఆ పనిలో తమకు ఎంత వాటా వస్తుందని ఆలోచించడమే తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే చంద్రబాబు సర్కార్‌కు లేదని ఆరోపించారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. ఇంత వరకు ఆ సబ్సిడీ రైతులకు అందించారా అని చంద్రబాబును ప్రశ్నించారు. 

బాబూ.. కాలక్షేపం కబుర్లు మానుకో..
 ప్రజా ఉపయోగకర పథకాలపై చర్చించకుండా ఐఏఎస్‌ స్థాయి అధికారులతో క్షేత్రస్థాయిలో సమావేశం నిర్వహించి కాలక్షేపం కబుర్లు చెబుతున్నారని వాసిరెడ్డి పద్మ బాబుపై  మండిపడ్డారు. చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలతో కలెక్టర్లు ఏం నేర్చుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏ ఎజెండా లేకుండా కలెక్టర్ల సమావేశం నిర్వహించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు వృధా చేస్తున్నారని ఫైరయ్యారు. ఒక్కో రోజు సమావేశానికి ప్రజాధనం రూ.1 కోటి చొప్పున ఖర్చు చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వం కలెక్టర్‌లకు ఏం చెప్పదలుచుకుందో కూడా స్పష్టత లేదన్నారు. కనీసం కలెక్టర్‌లకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు సమీక్షలు నిర్వహించి ప్రజాఉపయోగకర కార్యక్రమాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని, బాధ్యాతాయుతంగా మాట్లాడాలని సూచించారు. కలెక్టర్‌ల మీటింగ్‌లో చంద్రబాబు వారికి క్లాస్‌పీకడం చూస్తుంటే పాలన ఎటుపోతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అర్థం లేని వాదనలు చేయకుండా తన ప్రవర్తనను మార్చుకోవాలని హితవు పలికారు.

అయ్యప్ప భక్తులను అవమానపరచడం బాధాకరం
కలెక్టర్‌ల సమావేశంలో చంద్రబాబు అయ్యప్ప భక్తులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రజలకు దేవుడిపై ఉన్న నమ్మకాన్ని అవహేళన చేసే విధంగా మాట్లాడారని  ఆమె విమర్శించారు. ప్రజలు పాపాలు ఎక్కువగా చేస్తున్నారు. పాపాలు ఎక్కువగా చేసే వారు దేవుడి హుండీలో ఎక్కువగా డబ్బులు వేస్తున్నారు. అయ్యప్ప దీక్షల సమయంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి. అని చంద్రబాబు మాట్లాడడం ప్రజలకు దేవుడిపై ఉన్న నమ్మకాన్ని కించపరిచినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు దేవుడి హుండిలో డబ్బు ఎక్కువగా చేరుతోంది. ప్రభుత్వానికి ఆదాయం తక్కువగా వస్తుందన్న బాధే కనబడుతుందన్నారు. చంద్రబాబుకు దైవభక్తి లేదు. పాపం అంటే అంతకంటే భయం లేదని వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. కలెక్టర్ల సమావేశంలో ఇలాంటి మాటలు మాట్లాడడం న్యాయమేనా అని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బెల్ట్‌షాపులు లేకుండా చేస్తానని సంతకం పెట్టారు. ఏమైందా సంతకం అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో విచ్చల విడిగా బెల్ట్‌షాపులు వ్యాపిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకోండి అని ఎప్పుడైనా ప్రకటించారా..? క్యాబినెట్‌ మీటింగ్‌లో ఏనాడైనా చర్చించారా..? అని బాబును సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి కర్త, కర్మ, క్రియ మొత్తం చంద్రబాబేనని, చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారులకు బలిపశువులను చేయొద్దని హెచ్చరించారు. ఇకనైనా చంద్రబాబు తన తీరు మార్చుకోకపోతే ప్రజాగ్రహం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
Back to Top