విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 'కాల్ మనీ-సెక్స్ రాకెట్' వ్యవహారంపై సీబీసీఐడీచే విచారణ చేయించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పద్మావతి కోరారు. టీడీపీ నేతలు ప్రధాన సూత్రధారులుగా ఉన్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. కాల్ మనీ ముసుగులో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఏపీ అసెంబ్లీలో నిలదీస్తామని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు.<br/>అధికార పార్టీ అండదండలతో ఐదేళ్లుగా చీకటి దందా నడుపుతున్న కాల్‌మనీ ముఠాకు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిపై కేసు నమోదైంది. ఈకాల్ మనీ సెక్స్ రాకెట్ లో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సహా మరికొందరి టీడీపీ నాయకుల హస్తం ఉండడంతో వారిని కేసు నుంచి తప్పించేందుకు పోలీసులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు ఎరవేసి వారి జీవితాలను బుగ్గిపాలు జేస్తున్న టీడీపీ నేతలను కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాలు, మహిళాసంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.