ఐకమత్యంతోనే అభివృద్ధి

రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంతో నడుస్తేనే అభివృద్ధి సాధ్యమవుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్‌లోని పరమేశ్వరి అవెన్యూ, పరమేశ్వరినగర్, శివగిరి కాలనీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగర కార్పొరేషన్‌ పరిధిలో రూరల్‌ నియోజకవర్గంలో నూతనంగా అనేక కాలనీలు అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్నాయన్నారు. నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీల్లో కనీస పాటి సౌకర్యాలు కూడా అధికారులు ఏర్పాటు చేయలేకపోతున్నారన్నారు. నగర కార్పోరేషన్‌ ఈ కాలనీలపై దృష్టి సారించాలని, కాలనీ ప్రజలు అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పరమేశ్వరి అవెన్యూ, పరమేశ్వరినగర్, శివగిరి కాలనీలో కూడా అభివృద్ధి కమిటీగా ఏర్పడి అభివృద్ధిలో స్వచ్ఛ నెల్లూరులో స్థానిక ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనని అధికారపక్షం మాపై కక్ష సాధించినా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తన శక్తికి మించి కృషి చేస్తానని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top